Fake News, Telugu
 

పోలాండ్‌లో ‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ ను దూషిస్తే మరణశిక్ష విధిస్తారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వందలాది మంది పోలాండ్ శరణార్థులకు ‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ అనే భారత రాజు ఆశ్రయం కల్పించాడని, అందుకు ప్రతిఫలంగా పోలాండ్ దేశంలో ఆయనకి అనేక గౌరవాలు దక్కాయని, ఇందులో భాగంగానే పోలాండ్‌లో ఆయన్ని ఎవరైనా దూషిస్తే మరణశిక్ష విధిస్తారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పోలాండ్ దేశంలో ‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ అనే భారతీయ రాజుని దూషిస్తే మరణశిక్ష విధిస్తారు.

ఫాక్ట్: ‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ రెండవ ప్రపంచయుద్ధ సమయంలో అనేకమంది పోలాండ్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్న విషయం వాస్తవమే. దీనికి ఆయన్ని పోలాండ్ ప్రభుత్వం అనేక విధాలుగా గౌరవించింది. కానీ ఆయన్ని దూషిస్తే పోలాండ్‌లో మరణశిక్ష విధిస్తారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా, 1997లోనే పోలాండ్ మరణశిక్షని రద్దు చేసింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

మీడియా కథనాల ప్రకారం, రెండవ ప్రపంచయుద్ధ సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ సైనికులు అనేకమంది పోలాండ్ ప్రజలను బానిసలుగా చేసుకొని సోవియట్ రష్యా, సైబేరియాలలో పని చేయించటానికి తరలించారు. అయితే 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్‌పై దండెత్తగా సోవియట్ యూనియన్ పోలాండ్ శరణార్థులకు విడుదల చేసింది. అయితే వీరికి నివాసం లేకపోవడంతో ఆసియాలోని అనేక దేశాలలో ప్రయాణించి చివరికి భారత్‌కు చేరుకున్నారు. అప్పటికే చాలా మంది ఆకలి, అనారోగ్యం బారిన పడి చనిపోయారు. అప్పటి నవా నగర్ రాజ్యానికి రాజైన ‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ వీరికి ఆశ్రయం ఇచ్చి అనేక సదుపాయాలు కల్పించారు. దీనికి ప్రతిఫలంగా పోలాండ్ ప్రభుత్వం ఆయన పేరుతో వీధులను, స్తూపాలను నిర్మించింది.

‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ గురించి భారత, పోలాండ్ ప్రభుత్వాల కలిసి నిర్మించిన డాక్యుమెంటరీని ఇక్కడ చూడవచ్చు. అయితే, ఆయనను దూషించిన వారికి మరణశిక్ష విధిస్తారనే విషయం పోలాండ్ రాజ్యాంగం మరియు పీనల్ కోడ్ లలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంపై మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తాకథనాలు కూడా లభించలేదు. పైగా 1997లోనే మరణశిక్షను పోలాండ్ అధికారికంగా రద్దు చేసింది.

చివరిగా, పోలాండ్‌లో ‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ ను దూషిస్తే మరణశిక్ష విధిస్తారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll