Fake News, Telugu
 

ఇందిరా గాంధీ కార్యాలయంలో కేవలం తనకు మాత్రమే కుర్చీ ఉంటుంది అన్న వాదన కల్పితమైనది

0

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గదిలో ఒకటే కుర్చీ ఉండేదని, అందులో తాను కూర్చుంటే, ఆమె ముందు ఎవరైనా నిలబడి ఉండాల్సిందేనని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మాజీ గవర్నర్ భీష్మ నారాయణ్ సింగ్ కూడా ఒకసారి ప్రైవేట్ సంభాషణలో ఇదే విషయం చెప్పినట్టు పేర్కొన్నారు. పైగా తమ వాదనకు మద్దతుగా,  ఇందిరా గాంధీ ముందు కొందరు నాయకులు నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గదిలో ఒకటే కుర్చీ ఉండేది, అందులో తాను కూర్చుంటే, ఆమె ముందు ఎవరైనా నిలబడి ఉండాల్సిందే.

ఫాక్ట్(నిజం): ఇందిరా గాంధీ ముందు ఎవరైనా నిలబడాల్సిందే, ఆమె కార్యాలయంలో తనకు మాత్రమే ఒక కుర్చీ ఉంటుంది అన్న వాదనలు కల్పితమైనవి. తన కార్యాలయం, పార్టీ కార్యక్రమాలు, మొదలైన సందర్భాలలో ఇతర నాయకులతో కలిసి కూర్చొని ఉన్న ఫోటోలు చాలా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అందులో తనతో పాటు వేరే వాళ్ళు కూడా కూర్చున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇందిరా గాంధీ కూర్చుంటే ఆమె ముందు ఎవరైనా నిలబడి ఉండాల్సిందే అన్న వాదన కల్పితం. ఎందుకంటే ఈ వాదనకు వ్యతిరేకంగా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి.  ఇందిరా గాంధీతో పాటు ఇతర నాయకులు కూర్చొని ఉన్న ఆమె ఆఫీస్‌కు సంబంధించిన ఫోటోలు, ఆఫీస్‌లో ఆమె కూర్చొని మాట్లాడుతున్న చాలా ఫోటోలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఉదాహారణకు కొన్ని ఫోటోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటోలలో ఇందిరా గాంధీ ఆఫీస్‌ ఏర్పాట్లు, అతిధులు/నాయకులు ఆమెతో పాటు కూర్చొని మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తాయి.

అలాగే పోస్టులో చెప్తున్నట్టు మాజీ గవర్నర్ భీష్మ నారాయణ్ సింగ్ కూడా ఒకసారి ప్రైవేట్ సంభాషణలో ఇదే విషయం చెప్పినట్టు కూడా ఎటువంటి ఆదారాలైతే మాకు లభించలేదు. దీన్నిబట్టి పోస్టులో చేస్తున్న వాదన అతిశయోక్తిగా అనిపిస్తుంది.

వైరల్ ఫోటో :

ఈ ఫోటో 1966లో ఇందిరా గాంధీ తన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో తీసింది. ఈ ఫోటోలో కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ ముందు నిలబడి ఉన్నా, కేవలం ఈ ఫోటో ఆధారంగా ఇందిరా గాంధీ ముందు ఎవరైనా నిలబడాల్సిందే అన్న వాదన కరెక్ట్ కాదు.

ఇందిరా గాంధీ, పార్టీ కార్యక్రమాలు, ఇతర సందర్భాలలో ఇతర నాయకులతో కలిసి కూర్చొని ఉన్న ఫోటోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఇందిరా గాంధీ కార్యాలయంలో కేవలం తనకు మాత్రమే కుర్చీ ఉంటుందన్న వాదన కల్పితమైనది.

Share.

About Author

Comments are closed.

scroll