Fake News, Telugu
 

హిజాబ్‌కు సంబంధించి ఇరాన్ కార్టూనిస్ట్ చేసిన కార్టూన్‌ని రాహుల్ గాంధీకి తప్పుగా ముడిపెడుతున్నారు

0

యూరప్ వార్తా పత్రికలో రాహుల్ గాంధీని, భారత దేశ ప్రజలను ఉద్దేశించి ఇటీవల ప్రచురించిన కార్టూన్ చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. దేశ ప్రజలను కష్టాల నుండి విముక్తి  చేయడానికి ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీని ప్రజలే అజ్ఞానంతో వ్యతిరేకిస్తూ కిందకు తోస్తున్నారనే అర్ధం వచ్చేలా ఈ కార్టూన్‌ని పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: యూరప్ వార్తా పత్రికలో రాహుల్ గాంధీని, భారత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రచురించిన కార్టూన్ చిత్రం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ కార్టూన్‌ని ఇరాన్‌కు చెందిన మన నేయేస్తని అనే కార్టూనిస్ట్ 2013లో పబ్లిష్ చేశారు. ఇరాన్ దేశంలో హిజాబ్ నిషేదానికి సంబంధించి ‘ఇరాన్ వైర్’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌ని ఉద్దేశిస్తూ మన నేయేస్తని ఈ కార్టూన్‌ని ప్రచురించారు. ఈ కార్టూన్‌తో రాహుల్ గాంధీకి గాని, భారత దేశ ప్రజలకు గాని ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే కార్టూన్ చిత్రాన్ని షేర్ చేస్తూ 2015లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఇరాన్ కార్టూనిస్ట్ మన నేయేస్తని ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిష్ చేసిన కార్టూన్ చిత్రాలంటూ ఈ ఫోటోని ఆర్టికల్‌లో షేర్ చేశారు.

ఈ కార్టూన్ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇరాన్  దేశం నుండి బహిష్కరించబడిన మన నేయేస్తని ఈ చిత్రాన్ని 2013లో తన ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ పేజీలలో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ కార్టూన్ చిత్రానికీ “Collaboration” అనే టైటిల్ పెట్టి, ఈ కార్టూన్ చిత్రాన్ని నిర్ధిష్ట సబ్జెక్టు ఎంచుకొని గీయలేదని తెలిపారు. మన నేయేస్తని ప్రచురించిన మరికొన్ని కార్టూన్ చిత్రాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

‘ఇరాన్ వైర్’ న్యూస్ వెబ్సైట్లో హిజాబ్ హక్కులకు సంబంధించి పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని షేర్ చేస్తూ మన నేయేస్తని ఈ కార్టూన్‌ని ప్రచురించారు. ఒకవేళ స్త్రీలు హిజాబ్ ధరించాలని కోరుకొంటే, వారిని హిజాబ్ తొలగించాలని బలవంతం చేసే హక్కు ఎవరికి లేదని మహిళ హక్కుల కార్యకర్త పర్విన్ భక్తియారంజాద్ ‘ఇరాన్ వైర్’కి ఇచ్చిన ఇంటర్వ్యూ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మన నేయేస్తని ఈ కార్టూన్‌ని ప్రచురించారు.

ఈ కార్టూన్ చిత్రాన్ని మన నేయేస్తనికి క్రెడిట్ ఇస్తూ పబ్లిష్ చేసిన వెబ్సైట్లు మరియు ఫేస్‌బుక్ పేజీలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ కార్టూన్ చిత్రంతో రాహుల్ గాంధీకి గాని, భారత దేశ ప్రజలకు గాని ఎటువంటి సంబంధం లేదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2013లో హిజాబ్‌కు సంబంధించి ఇరాన్ కార్టూనిస్ట్ మన నేయేస్తని పబ్లిష్ చేసిన కార్టూన్‌ని రాహుల్ గాంధీని, దేశప్రజలను ఉద్దేశిస్తూ యూరప్ వార్తా పత్రిక ప్రచురించిన కార్టూనంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll