ఉత్తరప్రదేశ్‌లోని సోరన్‌లో జరిగిన ఎన్నికల బహిరంగా సభలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో తమ కాంగ్రెస్ కూటమి(I.N.D.I.A) అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరానికి తాళం వేస్తామని చెప్పడంతో అక్కడి ప్రజలు అఖిలేష్ యాదవ్‌పై చెప్పుల వర్షం కురిపించారు అని చెప్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని సోరన్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ప్రజలు చెప్పులు విసురుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం పరిధిలో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీకి సంబంధించినవి. ఈ వీడియోలో ప్రజలు అఖిలేష్ యాదవ్‌పై పువ్వులు, పూల దండలు విసిరారు. అంతేకాకుండా, ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ అఖిలేష్ యాదవ్‌పై ప్రజలు బూట్లు, చెప్పులు విసిరినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. అలాగే, తమ I.N.D.I.A కూటమి అధికారంలోకి వస్తే, అయోధ్యలోని రామాలయానికి తాళం వేస్తామని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించినట్లు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
వైరల్ పోస్టులో తెలిపినట్టుగా, 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సోరన్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు తమ కాంగ్రెస్ కూటమి(I.N.D.I.A) అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరానికి తాళం వేస్తామని అన్నారా? ఈ వ్యాఖలు చేసినందుకు అఖిలేష్ యాదవ్‌పై ప్రజలు చెప్పులు వేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కానీ, ఆయన పై ప్రజలు చెప్పులు విసిరినట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు.
వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ‘@vikashyadavauraiyawale’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా యొక్క వాటర్‌మార్క్‌ను మనం గమనించవచ్చు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మేము పరిశీలించగా, అతను అదే వైరల్ వీడియోను (ఆర్కైవ్ లింక్) 02 మే 2024న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. వీడియోలో ‘లైవ్ ఫ్రమ్ కన్నౌజ్’ అని రాసి ఉండడం మనం చూడవచ్చు.
ఈ వైరల్ వీడియోను స్లో మోషన్‌లో జాగ్రత్తగా గమనిస్తే, అఖిలేష్ యాదవ్‌పై ప్రజలు పువ్వులు, దండలు విసిరినట్లు స్పష్టమవుతుంది. ఈ మొత్తం వీడియోలో ప్రజలు ఎక్కడా బూట్లు, చెప్పులు విసిరినట్లు మనకు కనిపించదు.
ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, సమాజ్‌వాదీ పార్టీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ని తనిఖీ చేసాము. 27 ఏప్రిల్ 2024న సమాజ్‌వాదీ పార్టీ అప్లోడ్ చేసిన ఒక వీడియోను పరిశీలించగా, వైరల్ వీడియోలో అఖిలేష్ యాదవ్ పక్కన ఉన్న మహిళ అదే దుస్తులను ధరించి ఈ వీడియోలో కూడా ఆయన పక్కన ఉండటం మనం చూడవచ్చు. ఈ వీడియో వివరణ ప్రకారం, కన్నౌజ్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే రసూలాబాద్‌లో అఖిలేష్ యాదవ్ రోడ్‌షో నిర్వహించారు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 27 ఏప్రిల్ 2024న కన్నౌజ్ లోక్‌సభ సీటు పరిధిలోని రసూలాబాద్‌లో జరిగిన ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీకి సంబంధించినది అని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, అఖిలేష్ యాదవ్‌పై ప్రజలు పువ్వులు, పూల దండలు విసిరిన ఈ వీడియోను ప్రజలు అతనిపై చెప్పులు విసిరారు అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.