Fake News, Telugu
 

ఈ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ తన నుదిటిపై తిలకంగా పూసుకుంటున్నది హోలికా చితాభస్మం, సైనికుడి చితాభస్మం కాదు

0

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక సైనికుడు ఇటీవల వీరమరణం పొందితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ సైనికుడి చితాభస్మాన్ని తన నుదిటిపై తిలకంగా పూసుకున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చనిపోయిన సైనికుడి చితాభస్మాన్ని నుదిటిపై తిలకంగా పూసుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటీవల హోలీ వేడుకలలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ హోలికా చితాభస్మాన్ని తన నుదుటిపై పూసుకున్న దృశ్యాలని చూపిస్తుంది. 1996 నుండి 2019 వరకు గోరఖ్‌పుర్ గోరక్షపీట్‌కి గోరక్షపీఠాధీశ్వరుడిగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్, హోలికాదహనం తరువాత మిగిలిన చితాభస్మాన్ని తిలకంగా పూసుకున్న తరువాతే హోలీ పండగని ప్రారంభించాలనే ఆచారాన్ని చాలా సంవత్సరాల నుండి పాటిస్తున్నారు. ఈ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ తన నుదుటిపై తిలకంగా పూసుకున్నది సైనికుడి చితాభస్మం కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని భగవ క్రాంతి సేన అధ్యక్షురాలు ప్రచి సాధ్వి 22 మార్చి 2022 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. సనాతన ఆచారాలలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హోలికా చితాభస్మాన్ని తన నుదిటిపై తిలకంగా పెట్టుకుంటున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో మరికొన్ని లోకల్ న్యూస్ చానల్స్ కూడా పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో భారీ విజయం సాధించిన తరువాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పుర్  గోరక్షపీట్‌లో ప్రజలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నట్టు తెలిసింది. అయితే, హోలికాదహనం చేసిన తరువాత ఆ  చితాభస్మాన్ని తిలకంగా పూసుకొని హోలీ వేడుకని ప్రారంభించాలనే ఆచారాన్ని గోరఖ్‌నాథ్ దేవాలయం ఇప్పటికీ పాటిస్తుంది. 1996 నుండి 2019 వరకు గోరక్పూర్ గోరక్షపీట్‌కి గోరక్షపీఠాధీశ్వరుడిగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ ఈ ఆచారాన్ని చాలా సంవత్సరాల నుండి పాటిస్తున్నారు.

యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పుర్ గోరక్షపీట్‌లో హోలీ వేడుకలు చేసుకున్న దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో యోగి ఆదిత్యనాథ్ తన నుదిటిపై తిలకంగా పూసుకున్నది హోలికా చితాభాస్మమని, వీరమరణం పొందిన దేశ సైనికుడిది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, యోగి ఆదిత్యనాథ్ హోలీ వేడుక సందర్భంగా హోలికా చితాభస్మాన్ని తిలకంగా పూసుకున్న దృశ్యాలని సైనికుడి చితాభస్మాన్ని తిలకంగా పూసుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll