“పశ్చిమ బెంగాల్‌లోని వీర్‌భూమ్‌లో, రాత్రి నిద్రిస్తున్న హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టారు, సుమారు 10 మంది హిందూ మహిళలు మరియు పిల్లలు అగ్నిప్రమాదం కారణంగా మరణించారు”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తాజగా బెంగాల్‌లోని బీర్‌భూంలో జరిగిన హింసాకాండ వీడియో. పది మంది హిందూ మహిళలు మరియు పిల్లలని నిప్పు పెట్టి చంపారు.
ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియోకి, తాజాగా బెంగాల్‌లోని బీర్‌భూంలో జరిగిన హింసాకాండకి ఎటువంటి సంబంధంలేదు. అది ఒడిశాలో జరిగిన ఒక బస్సు ప్రమాడానికి సంబంధించిన పాత వీడియో. అంతేకాదు, చనిపోయిన వారిలో పది మంది హిందూ మహిళలు మరియు పిల్లలు ఉన్నట్టు ప్రచారం అవుతున్న మాటల్లో నిజం లేదని పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించి ఎటువంటి సమాచారం దొరకలేదు. అయితే, వీడియోని సరిగ్గా చూస్తే, కాలిపోయిన శరీరాలను బస్సు పక్కన పడుకోపెట్టినట్టు గమనించవచ్చు. కొన్ని పదాలతో ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి దృశ్యాలే సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. అది ఒడిశాలో జరిగిన ఒక బస్సు ప్రమాదానికి సంబంధించిన పాత వీడియో అని తెలిసింది. పోస్ట్‌లోని వీడియోలో ఉన్న అదే బస్సును ఒడిశా ఘటన దృశ్యాల్లో చూడవచ్చు. 2020లో జరిగిన ఆ ఘటనకి సంబంధించిన వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అంతేకాదు, బీర్‌భూం ఘటనలో చనిపోయిన వారిలో పది మంది హిందూ మహిళలు మరియు పిల్లలు ఉన్నట్టు ప్రచారం అవుతున్న మాటల్లో నిజం లేదని పశ్చిమ బెంగాల్ పోలీసులు ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీర్‌భూం బాధితులకి సంబంధించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు. ఎవరూ కూడా పది మంది హిందూ మహిళలు మరియు పిల్లలు చనిపోయినట్టు రిపోర్ట్ చేయలేదు.
చివరగా, బీర్‌భూం ఘటనలో హిందూ మహిళలు, పిల్లలు చనిపోయినట్టు ఉన్న పోస్టులు తప్పని బెంగాల్ పోలీసులు తెలిపారు. వీడియో కూడా ఒడిశాలో జరిగిన ఒక పాత బస్సు ప్రమాదానికి సంబంధించినది.