Fake News, Telugu
 

వివిధ దేశాల తప్పుడు పెట్రోల్ ధరలను భారత దేశం లో ధరలతో పోలుస్తున్నారు.

0

పలు దేశాలలోని పెట్రోల్ ధరలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతూ వుండే పోస్ట్ ఒకటి సోషల్ మీడియా చెక్కర్లు కొడుతోంది. అందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

 ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇతర దేశాలలో లీటర్ పెట్రోల్ ధర భారత్ లో కన్నా చాలా తక్కువగా ఉంది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్తున్న ధరలకు ఆయా దేశాలలోని అసలు ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. లీటర్ పెట్రోల్ ధర కొన్ని దేశాల్లో భారత్ లో కంటే ఎక్కువగా ఉంది. కావున పోస్టులో చెపుతున్నది తప్పు.

పై పోస్ట్ లో పేర్కొన్న ఒక్కో దేశంలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొనే ప్రయత్నం చేయగా, పాకిస్తాన్ లోని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటింగ్ అథారిటీ 26 జూన్ 2020 సర్కులర్ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర PKR 100.11గా ఉంది, భరత దేశ కరెన్సీ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ₹ 45.35. పాకిస్తాన్ లో షెల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కూడా పై ధరకే పెట్రోల్ విక్రయిస్తుంది. ఈ సమాచారం వారి వెబ్సైటు లో చూడొచ్చు. బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకారం ఆ దేశం లో లీటర్ పెట్రోల్ ధర 86 టక, అంటే మన దేశ రూపాలలో ఇది ₹ 76. 26. శ్రీలంక లోని మినిస్ట్రీ అఫ్ పెట్రోలియం రిసోర్స్ డెవలప్మెంట్ ప్రకారం ఆ దేశం లీటర్ పెట్రోల్ ధర LKR 161. ఇది ఇండియన్ కరెన్సీ లో ₹ 65. 20 తో సమానం. కానీ పోస్ట్ లో చెపుతున్న దాని ప్రకారం పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర ₹ 26, బాంగ్లాదేశ్ లో ₹ 22, అదే శ్రీలంక లో ఐతే ₹ 34, ఇవి పూర్తిగా తప్పు.

గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ అనే ఒక సంస్థ సుమారు 150 దేశాలలో పెట్రోల్ రిటైల్ ధరలకు సంబంధించిన డేటాని సేకరించి తమ వెబ్సైటు లో అందుబాటులో వుంచుతుంది. ఈ సంస్థ ప్రతీ వారం సమాచారాన్ని అప్డేట్ చేస్తుంది. బార్క్లేస్, గోల్డ్మన్ సాక్స్, ఎరిక్సన్ వంటి ప్రముఖ సంస్థలు వీరి క్లైంట్స్ గా ఉన్నాయి. ఈ సంస్థ వరల్డ్ బ్యాంకు వారు విడుదల చేసే వరల్డ్ ఎకనామిక్ ప్రోస్పెక్ట్స్ రిపోర్ట్ కోసం డేటాని కూడా సమకూర్చింది. ఈ సంస్థ వెబ్సైటు ప్రకారం 06 జూన్ 2020న ఇటలీ లో లీటర్ పెట్రోల్ ధర మన దేశ కరెన్సీ లో ₹ 120.50, అదే క్యూబా లో ఐతే ₹ 89.64, నేపాల్ లో ₹ 60.23. వైరల్ అవుతున్న పోస్ట్ లోని ధరలకు అసలు ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. పోస్ట్ ప్రకారం ఇటలీ లో లీటర్ పెట్రోల్ ధర ₹ 14, క్యూబా లో ₹ 19, నేపాల్ లో ₹ 34. ఇదే విధంగా ఆఫ్ఘానిస్తాన్ లో అసలు ధర ₹33.01 కానీ పోస్ట్ లో ఉన్న ధర ₹ 36. బర్మా లో అసలు ధర ₹ 38.24, కానీ పోస్టు లోని ధర ₹ 30. పాకిస్తాన్,శ్రీలంక,భారత్ మరియు బంగ్లాదేశ్ లోని అసలు ధరలను, ఈ వెబ్సైటు లోని ధరలను పోల్చిచూసినప్పుడు మాకు తేడా ఏమి కనిపించలేదు.

దీన్ని బట్టి పెట్రోల్ ధర భారత్ తో పోల్చిచూస్తే కొన్ని దేశాల్లో ఎక్కువగా, కొన్ని దేశాల్లో తక్కువగా ఉన్నాయి. ఐతే వైరల్ అవుతున్న పోస్ట్ లో ఉన్న ధరలకు,అసలు ధరలకు చాలా వ్యత్యాసముంది. కావున ఈ పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll