ఇటీవల బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కి కోవిడ్ -19 ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరాడు. అయితే, ఈ సందర్భం లో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో చలామణీ అవుతోంది. ఆ వీడియోలో అమితాబ్ బచ్చన్ కోవిడ్-19 సమయంలో నానావతి హాస్పిటల్ సిబ్బంది చేస్తున్న శ్రమని అభినందిస్తారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమితాబ్ బచ్చన్ కోవిడ్ -19 చికిత్స కోసం నానావతి హాస్పిటల్ లో చేరిన తర్వాత అక్కడి వైద్యుల, నర్సుల మరియు ఆరోగ్య సిబ్బంది శ్రమని మెచ్చుకుంటున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): అమితాబ్ బచ్చన్ కి ‘11 జూలై 2020 ’న కోవిడ్ -19 ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన చికిత్స కోసం నానావతి ఆసుపత్రిలో చేరారు. కానీ వైరల్ వీడియో కనీసం ‘ఏప్రిల్ 2020’ నుండి ఇంటర్నెట్‌లో ఉన్నట్లు తెలిసింది. కాబట్టి, అమితాబ్ బచ్చన్ మాట్లాడుతున్న వీడియో ఆయనకి కోవిడ్ -19 నిర్ధారణ అవడానికంటే ముందుది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
అమితాబ్ బచ్చన్ కి మరియు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కి ‘11 జూలై 2020 ’ న కోవిడ్ -19 ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. దాంతో వారు చికిత్స కోసం నానావతి హాస్పిటల్ లో చేరారు.
వీడియో గురించి సమాచారం కోసం కీవర్డ్స్ తో వెతికినప్పుడు, పోస్టులో చెప్పిన విషయంతోనే తెలుగు న్యూస్ చానెల్స్ ‘Tv9’ (ఆర్చివ్డ్), ‘ABN Andhra Jyothi’ (ఆర్చివ్డ్), ‘ETV Telangana’ (ఆర్చివ్డ్) మరియు ‘ETV Andhra Pradesh’ (ఆర్చివ్డ్) కూడా రిపోర్ట్ చేసినట్లుగా తెలిసింది. కానీ వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యూట్యూబ్ లో గతంలోనే ఉన్నట్లుగా తెలిసింది. ఆ వీడియో ని యూట్యూబ్ లో ‘AMITABH BACHCHAN | SALUTE TO DOCTORS | NANAVATI HOSPITAL | CORONA WARRIORS | COVID 19 | INDIA’ అనే టైటిల్ తో ‘22 ఏప్రిల్ 2020’ న అప్లోడ్ చేసారు. కావున వీడియో అమితాబ్ బచ్చన్ కి కోవిడ్ -19 నిర్ధారణ అవడానికంటే ముందుది.
‘నానావతి హాస్పిటల్’ వారు కూడా అమితాబ్ బచ్చన్ ఆరోగ్య సిబ్బంది శ్రమని ప్రశంసిస్తున్న వీడియో ‘ఏప్రిల్ 2020’ లో తీసినదని స్పష్టం చేశారు.
చివరగా, అమితాబ్ బచ్చన్ నానావతి హాస్పిటల్ సిబ్బందిని అభినందిస్తున్న సంబంధించిన పాత వీడియో ని పోస్టు చేసి, తాజా వీడియో అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.