Fake News, Telugu
 

కల్తీ పాల వల్ల భారత దేశంలో కాన్సర్ అవకాశాల మీద WHO ఎలాంటి అడ్వైసరీ ఇవ్వలేదు

0

2025 నాటికి 87% మంది భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది అని, ప్రస్తుత నివేదికల ప్రకారం 68.7% పాలు కల్తీ అని ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కల్తీ పాల వినియోగం వల్ల 2025 నాటికి దేశంలోని 87% జనాభా క్యాన్సర్‌తో బాధపడుతుందని WHO భారత ప్రభుత్వానికి అడ్వైసరీ ఇచ్చింది.

ఫాక్ట్(నిజం): పాలు లేదా పాల ఉత్పత్తుల కల్తీ సమస్యపై భారత ప్రభుత్వానికి WHO అటువంటి అడ్వైసరీ ఏదీ ఇవ్వలేదు. ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్న ఈ తప్పుడు వార్తలపై WHO మరియు భారత ప్రభుత్వం వివరణలు జారీ చేశాయి. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

దేశంలో 87% జనాభా కల్తీ పాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో బాధపడే అవకాశం ఉందని WHO భారత ప్రభుత్వానికి అడ్వైసరీ జారీ చేసిందా లేదా అని మేము వెతికితే, ఈ వైరల్ వార్తకు సంబంధించి WHO విడుదల చేసిన ప్రెస్ నోట్ లభించింది. WHO ప్రెస్ నోట్‌లో ఇలా పేర్కొంది, “పాలు/పాల ఉత్పత్తుల కల్తీ సమస్యపై భారత ప్రభుత్వానికి WHO ఎటువంటి అడ్వైసరీ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాం”

అంతే కాకుండా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా WHO భారత ప్రభుత్వానికి అలాంటి అడ్వైసరీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. 22 నవంబర్ 2019న, 87% మంది జనాభా కల్తీ పాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని WHO ప్రభుత్వానికి అడ్వైసరీ ఇచ్చిందనే పుకార్లపై పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అప్పటి కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, పాల కల్తీపై భారత ప్రభుత్వానికి WHO అటువంటి అడ్వైసరీ ఏదీ జారీ చేయలేదని తెలిపారు.

అంతే కాకుండా, దేశంలో విక్రయిస్తున్న 68.7 శాతం పాలు, పాల ఉత్పత్తులపై FSSAI నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లేవని మరో ప్రశ్నకు సమాధానంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ “FSSAI 2018లో నిర్వహించిన నేషన్‌వైడ్ మిల్క్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సర్వేలో కేవలం 7% (మొత్తం 6,432 నమూనాలలో 456) మాత్రమే కలుషితాలు (యాంటీబయాటిక్స్, పురుగుమందులు మరియు అఫ్లాటాక్సిన్M1) కలిగి ఉన్నాయని వెల్లడించింది. ఇంకా, మొత్తం 6,432 నమూనాలలో 12 మాత్రమే పాల భద్రతను ప్రభావితం చేసే కల్తీలను కలిగి ఉన్నాయి. ఈ 12 నమూనాలలో హైడ్రోజన్పెరాక్సైడ్‌తో కల్తీ చేసిన 6 నమూనాలు, డిటర్జెంట్లతో కల్తీ చేసిన 3 నమూనాలు, యూరియాతో కల్తీ చేసిన 2 నమూనాలు మరియు ఒక నమూనాలో న్యూట్రలైజర్ ఉన్నట్లు కనుగొనబడింది”అని తెలిపారు.

19 డిసెంబర్ 2023న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ,“2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం పాల ఉత్పత్తి 230.6 మిలియన్ టన్నులుగా నివేదించబడింది.” అని తెలిపారు.

చివరిగా, కల్తీ పాల సమస్యపై భారత ప్రభుత్వానికి WHO ఎలాంటి అడ్వైసరీ ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll