Fake News, Telugu
 

ఈ సరస్సులో కనిపిస్తున్నది మంచు మధ్యలో ఉన్న నీరు; మహా సర్పం నీడ కాదు

0

నీటిలో పాము వంటి ఆకారాన్ని చూపుతూ ఇది అమరనాథ్ యాత్రకు వెళ్ళే దారిలో శేషనాగ్ సరస్సులోని మహా సర్పం యొక్క కదులుతున్న నీడ అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: అమరనాథ్ యాత్రకు వెళ్ళే దారిలో ఉన్న శేషనాగ్ సరస్సులోని మహా సర్పం యొక్క కదులుతున్న నీడ దృశ్యాలు.

ఫాక్ట్: వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ‘శేష నాగ్’ సరస్సువే అయినప్పటికీ, పాము ఆకారంలో ఉన్నది మహాసర్పం యొక్క నీడ కాదు, అది నీరు. భూమికి 3590 మీటర్ల ఎత్తున ఈ ఉన్న ఈ ‘శేషనాగ్’ సరస్సు, అమరనాథ్ యాత్రకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ సరస్సులోని నీరు చలికాలంలో గడ్డ కడుతుంది. అయితే సరస్సు పాక్షికంగా గడ్డ కట్టినప్పుడు, మంచు మధ్యలో వివిధ ఆకారాలలో నీరు కనిపిస్తుంది. కానీ మంచు పూర్తిగా కరిగినప్పుడు ఇటువంటి ఆకారాలు కనిపించవు. ఇతర గడ్డ కట్టే సరస్సులలో కూడా ఇటువంటి అనేక ఆకారాలను చూడవచ్చు. మరియు ఈ సరస్సులో మహా సర్పం ఉంది అని కొందరు భక్తుల నమ్మకం, కానీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

ముందుగా వైరల్ వీడియోని ‘శేష నాగ్’ సరస్సు యొక్క ఇతర వీడియోలతో పోల్చి చూడగా, వైరల్ వీడియోలో దృశ్యాలు ‘శేష నాగ్’ సరస్సువి అని తెలిసింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ & ‘ABP News’ కథనాల ప్రకారం, భూమికి 3590 మీటర్ల ఎత్తున ఈ ఉన్న ఈ ‘శేషనాగ్’ సరస్సు, అమరనాథ్ యాత్రకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ సరస్సులోని నీరు చలికాలంలో గడ్డ కడుతుంది. ఈ సరస్సుని విష్ణుమూర్తి సృష్టించాడు అని, ఇందులో ఇప్పటికీ ‘శేష నాగు’ ఉంది అని కొందరు నమ్ముతారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు లేవు.

ఇక ఇదే వైరల్ వీడియోని మరింత స్పష్టంగా యూట్యూబ్లో చూడవచ్చు. ఈ వీడియోలో పాము ఆకారంలో కనిపిస్తున్నది పాము నీడ కాదు, అది నీరు. చల్లటి వాతావరణం వలన సరస్సులోని నీరు పై నుంచి కిందకు గడ్డ కట్టడం జరుగుతుంది. అలా గడ్డ కట్టడం వలన ఏర్పడిన మంచు నీటి పైన తేలుతూ ఉంటుంది. అయితే సరస్సులోని నీరు పూర్తిగా గడ్డ కట్టకుండా ఉండటం వలన మంచు మధ్య ఖాళీలలో అలాంటి నీటి ఆకారాలు ఆకారాలు ఏర్పడతాయి. ఇలాంటి నీటి ఆకారాన్ని వీడియోలో వేరే ప్రదేశంలో కూడా చూడవచ్చు.

ఈ సరస్సు పాక్షికంగా గడ్డ కట్టినప్పుడు, అనేక ఆకారాల్లో కనిపిస్తున్న నీటి యొక్క దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఈ సరస్సులో మంచు అంతా కరిగినప్పుడు ఇటువంటి ఆకారాలు కనిపించలేదు.

అలాగే, ఇతర గడ్డ కట్టే సరస్సులు, నదులలో కూడా ఇలాంటి అనేక ఆకారాలు ఏర్పడటం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, పాక్షికంగా గడ్డ కట్టిన శేష నాగ్ సరస్సులోని నీటి దృశ్యాలను, శేష నాగు యొక్క నీడ అని చెప్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll