“రాజమండ్రి లూథరన్ చర్చిలో 29 జనవరి 2023, ఆదివారం, చర్చిలో వచ్చిన కానుకలలో వారి వాటా దశమ భాగాల కోసం కొట్టుకుంటున్న చర్చి పాస్టర్లు” అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: రాజమండ్రి లూథరన్ చర్చిలో పాస్టర్లు గొడవ పడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్: 29 జనవరి 2023 ఆదివారం నాడు హైదరాబాద్ లక్డికపూల్‌లోని లూథరన్ చర్చిలో ఈ ఘటన జరిగింది. చర్చిలో ఆరాధన ఎవరు చేయాలో అనే విషయం పైన పాస్టర్ మోసెస్ కి ఇతర పాస్టర్లతో గొడవ జరిగింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ అవుతున్న వీడియోల కింద కామెంట్లను పరిశీలించగా, అనేకమంది ఈ వీడియో రాజమండ్రికి సంబంధించింది కాదని, ఈ ఘటన హైదరాబాద్ లక్డికపూల్‌లోని లూథరన్ చర్చిలో జరిగిందని చెప్పారు. దీని ఆధారంగా మేము ఈ చర్చికి సంబంధించిన “Lutheran Church Hyderabad” యూట్యూబ్ ఛానెల్లో 29 జనవరి 2023 ఆదివారం నాడు ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోని పరిశీలించాము.(ఇదే వీడియోని ఇక్కడ కూడా చూడవచ్చు).
ఇక వైరల్ వీడియోలోని దృశ్యాలను లైవ్ వీడియోలోని దృశ్యాలతో పోల్చి చూడగా రెండూ ఒకటే సంఘటనకు సంబంధించినవని నిర్ధారించవచ్చు.
అయితే ఈ వైరల్ వీడియో 2019 నాటిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ఫాక్ట్ చెక్ విభాగం తప్పుగా పేర్కొని ఫాక్ట్-చెక్ చేసింది. కానీ, నిజానికి ఈ ఘటన 29 జనవరి 2023 ఆదివారం నాడు హైదరాబాద్ లక్డికపూల్‌లోని లూథరన్ చర్చిలో జరిగింది. యూట్యూబ్ వీడియోలోని సంభాషణను బట్టి చర్చిలో ఆరాధన ఎవరు చేయాలో అనే విషయం పైన పాస్టర్ మోసెస్ కి ఇతర పాస్టర్లతో వివాదం తలెత్తిందని తెలుస్తుంది.
చివరిగా, హైదరాబాద్ చర్చిలో పాస్టర్ల మధ్య జరిగిన గొడవ దృశ్యాలను రాజమండ్రిలో జరిగిన ఘటనగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.