కరోనా తరహాలోనే చైనాలో వేగంగా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వేగంగా వ్యాపిస్తోందని, ఈ వ్యాధి బారిన పడి చైనాలో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). HMPVతో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, న్యుమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, “కొత్త వైరస్ కారణంగా చైనాలో పిట్టలా రాలిపోతున్న జనం” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: కొత్త HMPV వైరస్ కారణంగా చైనాలో చాలా మంది ప్రజలు మరణించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2022 నాటిది. ఈ వైరల్ వీడియో 2022లో కరోనా సమయంలో చైనా తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా అక్కడి ప్రజలను బలవంతంగా కోవిడ్ శిబిరాలకు తరిలిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. HMPV వైరస్ కారణంగా చైనాలో చాలా మంది మరణించినట్లు తెలిపే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ ఏవీ లేవు. చైనాలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, ఈ వ్యాధి బారిన పడి చైనాలో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి.కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో తొలి పాజిటివ్ కేసు బెంగళూరులో నమోదైంది. బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు HMPV వైరస్ సోకినట్లు తేలింది. కర్ణాటకలో రెండు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులను ఐసీఎంఆర్ (ICMR) ఢిల్లీ గుర్తించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. అలాగే భారత ప్రభుత్వం కూడా కర్ణాటకలో రెండు HMPV కేసులు నమోదయ్యాయని పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఇకపోతే , వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ నవంబర్ 2022లో ప్రచురించబడిన డైలీ స్టార్ (Daily star) వార్తాకథనం (ఆర్కైవ్డ్) ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వైరల్ వీడియో 2022లో కరోనా సమయంలో చైనా తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా అక్కడి ప్రజలను బలవంతంగా కోవిడ్ శిబిరాలకు తరిలిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది.
ఇదే వైరల్ వీడియోలో దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 2022లో ప్రచురించబడిన మరిన్ని వార్తాకథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. అలాగే అక్టోబర్ 2022లో ఇవే దృశ్యాలను X(ట్విట్టర్)లో షేర్ (ఆర్కైవ్డ్) చేస్తూ “జీ జిన్‌పింగ్ పాలనలో, ప్రతి రాత్రి, వేలాది మంది ప్రజలు కోవిడ్ క్వారంటైన్ క్యాంపుల్లోకి బలవంతంగా పంపబడుతున్నారు” అని ఓ యూజర్ పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ వీడియో ప్రస్తుతం చైనాలో విస్తరిస్తున్న HMPV వైరస్‌కు సంబంధించినది కాదని స్పష్టం అవుతుంది.
HMPV అంటే ఏమిటి?
అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, HMPV వైరస్ 23 సంవత్సరాలుగా భూమిపై ఉంది. ఇది మొదట 2001లో కనుగొనబడింది. HMPV RSVతో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. HMPV అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. HMPV వైరస్ తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశముంది.
HMPV లక్షణాలు
1. నిరంతర జ్వరం
2. దగ్గు, గొంతు నొప్పి
3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
4. అలసట, బలహీనత మొదలైనవి
HMPV చికిత్స: ప్రస్తుతం, HMPV చికిత్సకు నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ లేదు మరియు HMPVని నిరోధించడానికి ఎలాంటి వ్యాక్సిన్/టీకా లేదు.
హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్ అన్నారు. ఇది సాధారణ జలుబుకు కారణమవుతుందని, ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులలో ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని ఆయన తెలిపారు. భారతదేశంలో HMPVకు వ్యాప్తికి సంబంధించి అసాధారణ పరిస్థితి లేదని, చలికాలంలో శ్వాసకోశ వైరస్ సోకడం సహజమేనని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నివారణ కోసం సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ గోయల్ సాధారణ ప్రజలను కోరారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఇతరులకు దూరంగా ఉండాలన్నారు. దగ్గినా, తుమ్మినా ప్రత్యేకంగా రుమాలు లేదా టవల్‌ను ఉపయోగించాలన్నారు. సాధారణ జలుబు లేదా జ్వరం లక్షణాల కోసం సాధారణ మందులు తీసుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. అలాగే, ఈ వైరస్ కారణంగా చైనాలో చాలా మంది మరణించినట్లు తెలిపే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ కూడా లభించలేదు.
చివరగా, కొత్త HMPV వైరస్ కారణంగా చైనాలో చాలా మంది మరణించారని పేర్కొంటూ కరోనా వైరస్‌కు సంబంధించిన 2022 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు.