Fake News, Telugu
 

‘ఓలా రెస్ట్ రూమ్స్’ పేరుతో ఓలా సంస్థ త్వరలో మొబైల్‌ టాయ్‌లెట్ క్యాబులను ప్రారంభించబోతున్నట్టుగా షేర్ చేస్తున్నది ఒక ప్రాంక్ వీడియో

0

ఓలా క్యాబ్ సంస్థ త్వరలో భారత దేశంలో మొబైల్‌ టాయ్‌లెట్లను ప్రారంభించబోతున్నాయి, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ‘ఓలా రెస్ట్ రూమ్స్’ మొబైల్ టాయ్‌లెట్ క్యాబుల సదుపాయాల గురించి వివరిస్తున్న ఒక ప్రకటన వీడియోని ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ఓలా క్యాబ్ సంస్థ త్వరలో దేశంలో మొబైల్‌ టాయ్‌లెట్ క్యాబులను ప్రారంభించబోతున్నట్టుగా షేర్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): 2019 ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఓలా సంస్థ దేశంలో మరుగుదొడ్ల కొరత మరియు పారిశుద్ధ్యం గురుంచి అవగాహన కోసం ఉద్దేశిస్తూ ఈ ప్రాంక్ వీడియోని పబ్లిష్ చేసింది. ఈ వీడియో ఒక ప్రాంక్ అని, ‘ఓలా రెస్ట్ రూమ్స్’ లాంటి సదుపాయలేవీ తాము ప్రారంభించట్లేదాని ఓలా మరో వీడియోలో స్పష్టం కూడా చేసింది. దేశంలో మరుగుదొడ్ల సదుపాయాలను మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ‘Gramalaya’ అనే NGO సంస్థతో జత కలిసినట్టు ఓలా అప్పుడు ప్రకటించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ 2019లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2019 ఏప్రిల్ ఫూల్ డే సందర్భంగా ఓలా సంస్థ పబ్లిష్ చేసిన ప్రాంక్ వీడియో అంటూ ఈ వీడియోని ఆ యూసర్ షేర్ చేశారు. ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇదే వీడియోని ఓలా 29 మార్చి 2019 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ అనే కొత్త సదుపాయాన్ని మీకు పరిచయం చేస్తున్నామంటూ ఓలా ఈ వీడియోని పబ్లిష్ చేసింది.

అయితే, 02 ఏప్రిల్ 2019 నాడు పబ్లిష్ చేసిన మరో వీడియోలో, ఓలా సంస్థ, ఇదివరకు తాము ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ పేరుతో పబ్లిష్ చేసిన వీడియో ఒక ప్రాంక్ వీడియో అని, ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ నిజం కాకపోవచ్చు కానీ, దేశంలో టాయ్‌లెట్ల కొరత మరియు పారిశుధ్య సమస్యలు నిజమని పేర్కొంది. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఓలా సంస్థ ఇలాంటి ప్రాంక్ వీడియోలను పబ్లిష్ చేస్తుంది.

దేశంలో మరుగుదొడ్ల సదుపాయాలను మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ‘Gramalaya’ అనే NGO సంస్థతో తాము జత కలిసినట్టు ఓలా తెలిపింది. 02 ఏప్రిల్ 2019 నుండి ప్రతి ఓలా రైడ్ బుకింగ్ నుండి ‘Gramalaya’కు ఒక రూపాయి విరాళం చెల్లించే సదుపాయం వినియోగదారులకు కల్పిస్తామని ఓలా తెలిపింది. ఓలా పబ్లిష్ చేసిన ఈ ప్రాంక్ వీడియోకి సంబంధించి పలు వార్తా సంస్థలు 2019లో ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఒక ప్రాంక్ వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరిగా, 2019లో ఓలా సంస్థ పబ్లిష్ చేసిన ఒక ప్రాంక్ వీడియోని నిజమని భావిస్తూ దేశంలో ‘ఓలా రెస్ట్ రూమ్స్’ పేరుతో ఓలా మొబైల్ టాయ్‌లెట్స్ క్యాబులను ప్రారంభించబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll