కర్ణాటకలో ప్రస్తుతం హిజాబ్ గురించి జరుగుతన్న ఘటనల నేపథ్యంలో ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. “హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు పెద్ద బెంచ్ తన తీర్పును ఇచ్చింది, ముస్లిం బాలికలు పాఠశాల దుస్తులలో మాత్రమే పాఠశాలకు రావాలని,….., ఒక అమ్మాయి అలా చేయని పక్షంలో, ఏ కారణం చెప్పకుండానే ఆమె పేరును కత్తిరించి ఇంటికి పంపే హక్కు పాఠశాలకు ఉంటుంది, దీని కోసం ఏ కోర్టులోనూ తదుపరి అప్పీలు చేయలేము,….., ఈ తీర్పును ఇచ్చిన న్యాయమూర్తి స్వయంగా ముస్లిం, అతని పేరు ముహమ్మద్ ముస్తాక్ ఖాన్……”, అని పోస్ట్‌లో రాస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ముహమ్మద్ ముస్తాక్ ఖాన్ ఇచ్చిన తీర్పు.
ఫాక్ట్: తరగతి గదుల్లో మతపరమైన దుస్తులు ధరించకూడదని చెప్తూ కర్నాటక హైకోర్టు త్రిసభ్య బెంచీ (ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ మరియు న్యాయమూర్తులు కృష్ణ ఎస్.దీక్షిత్, ఖాజీ జైబున్నీసా మొహియుద్దీన్) హిజాబ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, అది తుది తీర్పు కాదు. కేసు తదుపరి విచారణ జరుగుతోంది. కర్ణాటక హైకోర్టులో మహ్మద్ గుస్తాఖ్ ఖాన్ పేరుతో న్యాయమూర్తి ఎవరూ లేరు. అంతేకాదు, మధ్యంతర ఉత్తర్వులను పాటించడంలో విఫలమైన విద్యార్థుల నమోదును రద్దు చేయడానికి పాఠశాల యాజమాన్యానికి కోర్టు అధికారం ఇవ్వలేదు. అలాగే, ఉత్తర్వులపై విద్యార్థులు తదుపరి అపీలు చేయలేరనే పోస్ట్‌లోని వాదన పౌరుల రాజ్యాంగ హక్కుకు విరుద్ధం. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
తాజాగా కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ అనుకూల మరియు వ్యతిరేఖ ఘటనల నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు హిజాబ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో కోర్టు తుది తీర్పు ఇచ్చేంత వరకు కాలేజీ యూనిఫాం కాకుండా తరగతి గదుల్లో మతపరమైన దుస్తులు ధరించకూడదని తెలిపింది.
హిజాబ్ కేసులో ప్రస్తుతానికి కర్ణాటక హైకోర్టు కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. పెద్ద బెంచీ ద్వారా ఈ కేసు తదుపరి విచారణ 15 ఫిబ్రవరి 2022న తిరిగి ప్రారంభమయ్యి, ప్రస్తుతం కొనసాగుతుంది. మధ్యంతర ఉత్తర్వులను 10 ఫిబ్రవరి 2022న కర్ణాటక హైకోర్టు త్రిసభ్య బెంచీ (ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ మరియు న్యాయమూర్తులు కృష్ణ ఎస్.దీక్షిత్, ఖాజీ జైబున్నీసా మొహియుద్దీన్) ఇచ్చింది. హిజాబ్ కేసులో ముహమ్మద్ ముస్తాక్ ఖాన్ అనే పేరుతో న్యాయమూర్తి ఎవరూ లేరు. అసలు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల లిస్టులోనే ఆ పేరుతో ఎవరూ లేరు.
అంతేకాకుండా, పోస్ట్‌లో చెప్పినట్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించడంలో విఫలమైన విద్యార్థుల నమోదును రద్దు చేయడానికి పాఠశాల యాజమాన్యానికి కోర్టు అధికారం ఇవ్వలేదు. అలాగే, ఉత్తర్వులపై విద్యార్థులు తదుపరి అపీలు చేయలేరనే పోస్ట్‌లోని వాదన పౌరుల రాజ్యాంగ హక్కుకు విరుద్ధం. ఈ కేసు ప్రాథమిక హక్కు అయిన మతపరమైన స్వేచ్ఛకు సంబంధించింది కాబట్టి, బాధిత పౌరుడు దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో అప్పీలు చేయవచ్చు.
చివరగా, ‘ముహమ్మద్ ముస్తాక్ ఖాన్’ అనే పేరుతో కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తి ఎవరూ లేరు. పోస్ట్‌లో హిజాబ్ గురించి ఉన్నది ఫేక్ తీర్పు. అలాంటి తీర్పును కర్ణాటక హైకోర్టు ఇవ్వలేదు.