Fake News, Telugu
 

2019లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్‌ని ప్రస్తుత మోదీ అమెరికా పర్యటనవంటూ షేర్ చేస్తున్నారు

0

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మరియు క్వాడ్ దేశాల (భారత్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా) అధినేతలతో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటి మోదీ అమెరికా పర్యటనకి సంబంధించినవంటూ కొన్ని వీడియోలు మరియు ఫోటోలు షేర్ చేసిన పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ వీడియోలు మరియు ఫోటోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత అమెరికా పర్యటనకు సంబంధించిన విజువల్స్.

ఫాక్ట్ (నిజం): ప్రస్తుత అమెరికా పర్యటనలో మోదీ ఎటువంటి సభలో పాల్గొనడం లేదు. ఈ వీడియో 2019లో మోదీ అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి సంబంధించింది. ఇక ఫోటోలోని పై భాగం కూడా 2019 హౌడీ మోదీ కార్యక్రమానికి సంబంధించింది కాగా, కింది స్టేడియం ఫోటో 2017లో అమెరికాలో జరిగిన సూపర్ బౌల్ ఫుట్ బాల్ లీగ్‌కి సంబంధించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో:

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మరియు క్వాడ్ దేశాల అధినేతలతో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ పర్యటన 22-25 సెప్టెంబర్ వరకు సాగనుంది. ఐతే ఈ పర్యటనకి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం అమెరికా పర్యటనలో మోదీ ఎటువంటి సభలో పాల్గొనడం లేదు. వార్తా కథనాలు ఈ షెడ్యూల్ ని ప్రచురించాయి. దీన్నిబట్టి ఈ వీడియో ఇప్పటి పర్యటనకు సంబంధించింది కాదని అర్ధమవుతుంది.

ఈ వీడియో 2019 సెప్టెంబర్ లో మోదీ అమెరికా పర్యటనలో భాగంగా హౌస్టన్ లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి సంబంధించింది. ఈ కార్యక్రమాన్ని అన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసాయి. పోస్టులోని వీడియోలో మోదీ స్టేజిపై నేతలకు కరచాలనం చేస్తున్న విజువల్స్ ఈ కథనాలలో చూడొచ్చు.

ఫోటో:

ఈ ఫోటో పై భాగంలో మోదీకి స్వాగతం తెలుపుతున్న హార్డింగ్ కూడా 2019లో జరిగిన మోదీ అమెరికా పర్యటనకి సంబంధించిందే. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే  2019లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భాగంగా ఇలా హార్డింగ్లను ఏర్పాటు చేసినట్టు ఇదే ఫోటోని ప్రచురించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

ఇక ఈ ఫోటోలోని కింది భాగమైన స్టేడియం ఫోటో 2017లో అమెరికాలో జరిగిన సూపర్ బౌల్  ఫుట్ బాల్ లీగ్‌కి సంబంధించింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా చేస్తే 2017లో జరిగిన సూపర్ బౌల్ లీగ్ న్యూస్ రిపోర్ట్ లో ఇదే ఫోటోని పబ్లిష్ చేసారు. ఈ ఫోటోకి మోదీ అమెరికా పర్యటనకి ఎటువంటి సంబంధంలేదు. దీన్ని బట్టి, 2019లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం ఫోటోని మరియు ఈ సూపర్ బౌల్ ఫోటోని డిజిటల్ గా అతికించినట్టు అర్ధం చేసుకోవచ్చు.

పైన తెలిపినట్టు ఇప్పటి అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ ఎటువంటి సభలో పాల్గొనడం లేదు, కాబట్టి ఈ ఫోటోలో కనిపిస్తున్నది మోదీ ప్రసంగాన్ని వినడం కోసం వచ్చిన జనాలనడంలో నిజం లేదు.

చివరగా, 2019లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్‌ని ప్రస్తుత మోదీ అమెరికా పర్యటనవంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll