Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లా ముర్షిదాబాద్‌లోని దర్బార్ షరీఫ్‌పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు

0

“బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లా ముర్షిద్‌పూర్‌లోని హిందూ గ్రామంపై ఇస్లామిక్ మూక దాడి చేసి హిందువుల ఇళ్లు, పంటలను ధ్వంసం చేసి పశువులను దోచుకున్నారు”  అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లా ముర్షిద్‌పూర్‌లోని హిందూ గ్రామంపై ఇస్లామిక్ మూక దాడి చేసి హిందువుల ఇళ్లు, పంటలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ సదర్ ఉపజిల్లాలోని లచ్‌మన్‌పూర్ ప్రాంతంలోని ముర్షిద్‌పూర్ పీర్ దర్బార్‌(ముస్లిం ప్రార్థన మందిరం) పై జరిగిన దాడిని చూపిస్తుంది. ఈ దాడి హిందువులపై జరిగింది కాదు, రెండు ముస్లిం వర్గాల మధ్య జరిగింది. ముర్షిద్‌పూర్ పీర్ దర్బార్ వద్ద ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానిక మదర్సా ఉపాధ్యాయులు మరియు స్థానిక గ్రామస్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో దర్బార్ షరీఫ్ సంరక్షకులు, భక్తులు మరియు గ్రామస్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఫలితంగా ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 29 నవంబర్ 2024 X(ట్విట్టర్)లో ఇదే వైరల్ వీడియోతో పాటు మరిన్ని వీడియోలు గల ఓ వైరల్ పోస్టుపై స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్) బంగ్లాదేశ్‌కు చెందిన ‘Rumorscanner’ అనే ఫాక్ట్ చెకింగ్ సంస్థలో పనిచేస్తున్న షహనూర్ రెహమాన్ చేసిన పోస్ట్‌ లభించింది. ఈ పోస్ట్‌లో, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు ఇది హిందువులపై దాడి కాదని, ఈ సంఘటనకు హిందువులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని షేర్పూర్‌లో జరిగిందని, అంతకుముందు జరిగిన ఘర్షణలలో హఫీజ్ ఉద్దీన్ అనే వ్యక్తి మరణించిన తరువాత ఈ సంఘటన జరిగిందని, ఈ సమయంలో కొంతమంది ముస్లిం మందిరంపై దాడి చేశారని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన ఓ వార్తా కథనాన్ని కూడా షేర్ చేశారు.

X(ట్విట్టర్) పోస్ట్‌లో షేర్ చేసిన వార్త కథనం (ఆర్కైవ్డ్ లింక్), 26 నవంబర్ 2024 ఉదయం షేర్పూర్ సదర్ ఉపజిల్లాలోని లచ్‌మన్‌పూర్ ప్రాంతంలోని ముర్షిద్‌పూర్ పీర్ దర్బార్‌లో జరిగిన విధ్వంసం, దోపిడీ ఘటనను వివరించింది.  

తదుపరి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 26 నవంబర్ 2024 ‘ఢాకా ట్రిబ్యూన్’ పబ్లిష్ చేసిన వార్త కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, 26 నవంబర్ 2024న షేర్పూర్‌లోని లచ్‌మన్‌పూర్ ప్రాంతంలో ఖ్వాజా బద్రుద్దీన్ హైదర్ (దోజా పీర్) కి సంబంధించిన ముర్షిద్‌పూర్ దర్బార్ షరీఫ్‌లో జరిగిన విధ్వంసం మరియు దోపిడీకి సంబంధించి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. దర్బార్ వద్ద ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానిక మదర్సా ఉపాధ్యాయులు మరియు స్థానిక గ్రామస్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని తెలుస్తుంది. దాదాపు 400-500 మంది వ్యక్తులు దర్బార్ షరీఫ్‌పై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేశారు మరియు కంచెలను పగులగొట్టారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నంలో దర్బార్ షరీఫ్ సంరక్షకులు, భక్తులు మరియు గ్రామస్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఫలితంగా పలువురు గాయపడ్డారు. అలాగే ఈ కథనం ఈ ఘర్షణలో గాయపడ్డ వ్యక్తుల పేర్లను కూడా పేర్కొంది. అందులో ఉన్న వారు అంత ముస్లిం పేర్లు కలిగి ఉన్నారు.  

ది డైలీ స్టార్ వార్త కథనం (ఆర్కైవ్డ్ లింక్) ప్రకారం, 26 నవంబర్ 2024న ముర్షిద్‌పూర్ దర్బార్ షరీఫ్‌పై జరిగిన దాడిలో 10 మందికి పైగా గాయపడ్డారని వారిలో ఒకరైన హఫీజ్ ఉద్దీన్ అనే 40 ఏళ్ల స్థానిక వ్యక్తి 27 నవంబర్ 2024న ఢాకా హాస్పిటల్‌లో మరణించాడు. అతని అంత్యక్రియలు ముర్షిద్‌పూర్ దర్బార్ షరీఫ్‌కు అర కిలోమీటరు దూరంలో ఉన్న జంషెడ్ అలీ మెమోరియల్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఉదయం 10:00 గంటలకు ఏర్పాటు చేశారు, ఆయన అంత్యక్రియలకు హాజరైనవారు ఆగ్రహంతో దర్బార్ షరీఫ్‌పై మరొక దాడి చేశారు.

ముర్షిద్‌పూర్ దర్బార్ షరీఫ్‌పై జరిగిన ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న న్యూస్ వీడియో రిపోర్టులను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. వైరల్ వీడియోలోని దృశ్యాలను ఈ న్యూస్ వీడియోలోని దృశ్యాలతో పోల్చి చూస్తే, వైరల్ వీడియోలోని దృశ్యాలు ముర్షిద్‌పూర్ దర్బార్ షరీఫ్‌పై జరిగిన దాడిని చూపిస్తున్నాయని మనం నిర్ధారించవచ్చు.

అలాగే మేము ఈ వార్తా కథనాల ఆధారంగా గూగుల్ మ్యాప్స్‌లో ముర్షిద్‌పూర్ దర్బార్ షరీఫ్‌ గురించి వెతకగా ఆ ప్రాంతం యొక్క పలు ఫోటోలు మాకు కనిపించాయి. ఈ ఫోటోలను ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్స్‌తో పోల్చి చూస్తే, సారూప్యతలు గమనించొచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ముర్షిద్‌పూర్ దర్బార్ షరీఫ్‌పై జరిగిన దాడిని చూపిస్తున్నాయని స్పష్టమవుతుంది. వార్త కథనాల మరియు రిపోర్ట్స్ ఆధారంగా ఈ దాడి హిందువులపై జరగలేదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లా ముర్షిదాబాద్‌లోని దర్బార్ షరీఫ్‌పై  జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll