Fake News, Telugu
 

జితన్ రామ్ మాంఝీ రామాయణాన్ని విమర్శిస్తూ 2023లో చేసిన వ్యాఖ్యలు తాను 2024లో కేంద్ర మంత్రిగా ఎన్నిక అయిన తరువాత చేసినట్టు షేర్ చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోని NDA కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన నేతృత్వంలో 71 మంది మంత్రులుగా ప్రమాణ శ్వీకారం చేసారు. అందులో, NDA కూటమిలో భాగమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) పార్టీకి చెందిన జితన్ రామ్ మాంఝీని కేంద్ర మంత్రిగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) శాఖకి కేటాయించారు. ఈ నేపథ్యంలో, జితన్ రామ్ మాంఝీ రామాయణం కల్పితం అని, రాముడు, రావణుడి గురించి మాట్లాడే బదులు బీజేపీ పేదల గురించి మాట్లాడాలి అని చెప్తున్న ఒక వీడియోను ఇటీవల తీసినదిగా సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: 2024లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జితన్ రామ్ మాంఝీ రామాయణం కల్పితం అని రాముడు, రావణుడి గురించి మాట్లాడే బదులు బీజేపీ పేదల గురించి మాట్లాడాలి అని విమర్శిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వైరల్ వీడియోలో జితన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలు మార్చ్ 2023లో చేసినవి. ఆయన జూన్ 2024లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) శాఖలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత చేసినవి కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

బీహార్ లో  హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) పార్టీకి నేతృత్వం వహిస్తున్న జితన్ రామ్ మాంఝీ ఇటీవల 2024 లోక్ సభ ఎన్నికలలో గెలిచిన NDA కూటమి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇంతముందు ‘మహాగట్బంధన్’ ప్రభుత్వంలో భాగంగా ఉన్న HAM పార్టీ జూన్ 2023లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో చేతులు కలిపింది.

జితన్ రామ్ మాంఝీ రామాయణాన్ని విమర్శిస్తూ ఏమైనా వ్యాఖ్యలు చేశారా అని యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికితే ఇవే విజువల్స్ తో ఉన్న వీడియోలు కొన్ని లభించాయి. ఈ వీడియోలను (ఇక్కడ మరియు ఇక్కడ) కొన్ని న్యూస్ ఛానల్ వారు మార్చ్ 2023లో అప్లోడ్ చేసారు. ఈ వీడియోల కింద ఉన్న వివరణలో మాంఝీ రామాయణం గురించి, శ్రీ రాముడు గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాక, ఈ సంఘటను రిపోర్ట్ చేసిన వార్త కథనాలను కూడా ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. వీటి ప్రకారం, HAM పార్టీ చీఫ్ జితన్ రామ్ మాంఝీ బీహార్ ‘మహాగట్బంధన్’ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు  బీజేపీ శాసనసభ్యులు హనుమాన్ చాలీసా పఠించిన నేపథ్యంలో మాంఝీ ఈ వ్యాఖ్యలు చేశారు. వైరల్ వీడియోలో మాంఝీ జర్నలిస్టులతో మాట్లాడుతున్న సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను ఇక్కడ చూడవచ్చు. 

అంతేకాక, ఇంతకు ముందు 2021, 2022లో కూడా మాంఝీ రామాయణాన్ని విమర్శిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేసినట్టు పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ)  రిపోర్ట్ చేసాయి. 

చివరగా, జితన్ రామ్ మాంఝీ రామాయణాన్ని విమర్శిస్తూ 2023లో చేసిన వ్యాఖ్యలు తాను 2024లో కేంద్ర మంత్రిగా ఎన్నిక అయిన తరువాత చేసినవిగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll