Fact Check, Telugu
 

కర్ణాటకకు సంబంధించిన ఈ వీడియోలను భైంసాలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు

0

తెలంగాణలో భైంసాలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన దృశ్యాలు అంటూ కొన్ని వీడియోలు (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఇదే వీడియోని షేర్ చేస్తూ మరొక పోస్టులో ఇది హైదరాబాద్ శ్రీరామ నవమి శోభాయాత్రకు సంబందించిన వీడియో అని కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలోని భైంసాలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్: మొదటి వీడియో కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి సంబంధించింది. రెండొవ వీడియో కర్ణాటకలోని గుల్బర్గాలో రామనవమి ఉత్సవాల్లో భాగంగా తీసింది. 10 ఏప్రిల్ 2022న నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రాంతంలో శ్రీ రామ నవమి శోభాయాత్ర ఘనంగా జరిగింది. కానీ, ఈ వీడియోలు మాత్రం భైంసా ప్రాంతానికి సంబంధించినవి కావు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో 1:

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియోలు (ఇక్కడ మరియు ఇక్కడ) కనీసం 2020 నుండి యూట్యూబ్‌లో షేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ, ఈ దృశ్యాలు ఏ ప్రాంతం నుండి తీసినవో ఆ వీడియోలలో తెలపలేదు. కొంచం క్లారిటీతో ఉన్న వీడియోను జాగ్రత్తగా గమనించగా, హోటల్ ప్రజ్వల్ అని ఇంగ్లీష్ మరియు కన్నడ భాషలో ఉన్న బోర్డ్ చూడొచ్చు. హోటల్ ప్రజ్వల్ అని గూగుల్లో వెతకగా, కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతంలో ఈ హోటల్ ఉన్నట్టు తెలుస్తుంది. గూగుల్లో దొరికిన హోటల్ యొక్క ఫోటోతో వీడియోలోని స్క్రీన్‌షాట్ పోల్చగా అవి ఒకటే అని తెలుస్తుంది.

వీడియో 2:

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న యూట్యూబ్ వీడియో దొరికింది. యూట్యూబ్ వీడియో ప్రకారం, ఆ విజువల్స్ కర్ణాటకలోని గుల్బర్గాలో రామనవమి ఉత్సవాల్లో భాగంగా తీసింది. గుల్బర్గాలోని దర్గా ఫోటో (గూగుల్ మ్యాప్స్ నుండి తీసుకోబడింది) వీడియోలో కనిపించే ఇస్లామిక్ నిర్మాణంలా ఉన్నట్టు చూడొచ్చు.

2021లో ఇదే వీడియో మహారాష్ట్రకు సంబంధించిందని వైరల్ అయినప్పుడు, దాన్ని తప్పని చెప్తూ ఫాక్ట్‌లీ రాసిన ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

10 ఏప్రిల్ 2022న నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రాంతంలో శ్రీ రామ నవమి శోభాయాత్ర ఘనంగా జరిగింది. శోభాయాత్రకు సంబంధించిన వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. కానీ వైరల్ అవుతున్న వీడియోలు మాత్రం భైంసా ప్రాంతానికి సంబంధించినవి కావు.

చివరగా, కర్ణాటకకు సంబంధించిన ఈ వీడియోలను భైంసాలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు  సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll