Fake News, Telugu
 

ఇటీవల రాంచీలో జరిగిన ED సోదాలకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సి.ఎం.రమేష్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికలు 13 మే 2024న జరగనున్న నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కూటమి తరపున పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్ధి సి.ఎం. రమేష్ ముఖ్య అనుచరుడి ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కూటమి బీజేపీ అభ్యర్ధి సి.ఎం. రమేష్ ముఖ్య అనుచరుడి ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కూటమి తరుపున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సి.ఎం.రమేష్ ఇంటిపై, లేదా ఆయన అనుచరుల ఇళ్ళపై ఇటీవల ఏదైనా దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించి భారీగా డబ్బు పట్టుకున్నట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 06 మే 2024న ED గతంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఝార్ఖండ్ రాజధాని రాంచీలో  నిర్వహించింన సోదాలకు సంబంధించింది. పలు రిపోర్ట్స్ ప్రకారం, ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పని మనిషిగా చెప్తున్న వ్యక్తి ఇంటి నుండి ED ఈ డబ్బులు జప్తు చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల సి.ఎం. రమేష్ ఇంటి నుండి కానీ, లేదా ఆయన అనుచరుల ఇళ్ళపై ఏదైనా దర్యాప్తు సంస్థ రైడ్ చేసిందా? లేదా సి.ఎం. రమేష్ ఇంటి నుండి కానీ, లేదా ఆయన అనుచరుల నుండి ఇలా డబ్బుల కట్టలు బయటపడ్డాయి? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.

ఈ వైరల్ ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇలాంటి దృశ్యాలనే రిపోర్ట్ చేసిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).ఈ వార్తా కథనాల ప్రకారం, 06 మే 2024న ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద పెట్టిన ఒక కేసుకి సంబంధించి ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన వీరేంద్ర రామ్ కి సంబంధించిన ప్రదేశాలలో జరిగాయి. ఈ సోదాల్లో 25 కోట్ల రూపాయలు జప్తు చేశారు.

ANI కథనం ప్రకారం సంజీవ్ లాల్ అనే వ్యక్తి యొక్క పని మనిషి ఇంట్లో నుండి ఈ డబ్బు స్వాధీనం చేసుకున్నారని, సంజీవ్ లాల్ ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి. ఫిబ్రవరి 2023లో నమోదైన వీరేంద్ర రామ్ కేసుకి సంబంధించి ఈ డబ్బుని జప్తు చేసుకున్నారు. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ ప్రభుత్వ పధకాల అమలులో అవకతవకాల గురించి 2023లో వీరేంద్ర రామ్ పై ఈ కేసు నమోదు చేసారు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో 06 మే 2024న ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ED రైడ్స్ సంబంధించినదిగా మనం నిర్థారించవచ్చు.

చివరగా, ఇటీవల రాంచీలో జరిగిన ED సోదాలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అనకాపల్లి కూటమి ఎంపీ బీజేపీ అభ్యర్థి సి.ఎం. రమేష్ అనుచరుడి ఇంట్లో భారీగా డబ్బు దొరికిందంటూ ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll