Fake News, Telugu
 

భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రధాని మోదీ అన్నారని Way2News ఈ కథనాన్ని ప్రచురించలేదు

0

ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ చట్టం చుట్టూ ఆంధ్ర ప్రదేశ్‌లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో Way2News వారు ప్రచురించిన ఒక వార్తా కథనం అని చెప్తూ ప్రధాని మోదీ ఫోటోతో కూడిన ఒక గ్రాఫిక్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకే నీతి ఆయోగ్ ప్రతిపాదించింది అని అనకాపల్లిలో జరిగిన NDA కూటమి సభలో మాట్లాడుతూ ఆయన అన్నారు అని ఇందులో ఉంది. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

దీని ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రధాని మోదీ అనకాపల్లిలో జరిగిన ప్రజా గళం సభలో అన్నారు అని Way2News ఒక వార్తా కథనం ప్రచురించింది. 

ఫాక్ట్: వాస్తవానికి ప్రధాని మోదీ ఈ సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. Way2News వారి కథనం అని చెప్పి వైరల్ అవుతున్న గ్రాఫిక్ కూడా ఎడిట్ చేయబడినది, దీని ఆర్టికల్ ఐ.డి way2.co/t5j8uu తో వారు మే 6వ తారీఖున రాహుల్ గాంధీ మీద ఒక కథనాన్ని ప్రచురించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి మొదటగా అనకాపల్లి సభకి చెందిన లైవ్ కవరేజ్ చూడగా, ఇందులో మోదీ చేసిన ప్రసంగంలో తను ఎక్కడ కూడా ‘భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అని పేర్కొనలేదు అని తెలిసింది. 

Way2News కథనం అని వైరల్ అవుతున్న గ్రాఫిక్ పైన ఉన్న ‘News Article ID’ way2.co/t5j8uu ని ఇంటర్నెట్‌లో వెతకగా, అసలు  Way2News వారు ఈ కథనాన్ని ప్రచురించనే లేదు అని మాకు తెలిసింది. ఈ ఐ.డి పైన వారు ప్రచురించిన కథనం మే 6వ తారీఖున వచ్చింది. ఇది రాహుల్ గాంధీ పైన వారు రాసిన కథనం, మోదీ అనకాపల్లి సభలో చేసిన వ్యాఖ్యల గురించి కాదు. 

ఇంకా, వైరల్ అవుతున్న గ్రాఫిక్ ఫేక్ అని, అసలు ఇలాంటి కథనాన్ని వారు ప్రచురించలేదు అని Way2News వారు తమ ఫాక్ట్-చెక్ “X” హ్యాండిల్ ద్వారా స్పష్టం చేశారు(ఆర్కైవ్ లింక్). 

అసలు ఈ చట్టం(ఇక్కడ, ఇక్కడ) ఏమిటి, దాని చుట్టూ ఎందుకు వివాదం నెలకొంది?

మొదటగా,ఈ చట్టం యొక్క పేరు సూచించినట్లుగా, ఈ చట్టం స్థిరాస్తుల యొక్క టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ యొక్క స్థాపన మరియు నిర్వహణకు సంబంధించినది. ఇది స్థిరాస్తి యజమానులకు ధృవీకరించబడిన శీర్షికలను(టైటిల్) అందిస్తుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో దీనిని ప్రస్తావిస్తూ (ఇక్కడ, ఇక్కడ) ‘భూ కబ్జా చట్టం’గా ముద్ర వేయడంతో అసలు వివాదం మొదలైంది.

కానీ ఆంధ్ర రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ మాత్రం ఈ చట్టాన్ని సమర్థిస్తూ ‘ఇది పారదర్శకతను మెరుగుపరుస్తుంది ఇంకా భూ హక్కులని రక్షిస్తుంది’ అని పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఇటీవల మాట్లాడుతూ(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ‘మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (భూ పట్టాల చట్టం) పై  ప్రజల్లో సందేహాలు సృష్టిస్తున్నారని’ వాపోయారు అని, ది హిందూ తమ వార్తా కథనంలో తెలిపింది.

స్థిరాస్తి యజమానులకు ఖచ్చితమైన, ధృవీకరించబడిన టైటిల్స్ ఇవ్వాలనే ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చింది అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించిన తర్వాతే ఈ చట్టాన్ని అమలు చేస్తామని ధర్మాన ప్రసాదరావు తెలిపారు

చివరిగా, భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రధాని మోదీ అన్నారని Way2News ఈ కథనాన్ని ప్రచురించలేదు. 

Share.

About Author

Comments are closed.

scroll