పంజాబ్ ఢిల్లీ సరిహద్దులో జరిగే ధర్నాలో రైతులు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ ‘ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్న దృశ్యాలు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్తగా అమలులోకి తెచ్చిన వ్యవసాయ బిల్లులని వ్యతిరేకిస్తూ రైతులు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న నేపధ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పంజాబ్ ఢిల్లీ సరిహద్దులో జరిగే ధర్నాలో రైతులు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ ‘ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో భారత దేశంలో రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించినది కాదు. ఇదే వీడియో సోషల్ మీడియా లో 2019 నుంచి ప్రచారంలో ఉంది. అమెరికాలో నివసిస్తున్న కొంతమంది సిక్కులు పాకిస్తాన్ దేశాన్ని సపోర్ట్ చేస్తూ ‘ఖలిస్తాన్ జిందాబాద్’ ‘ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్’ అనే నినాదాలతో ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియో ఆ ర్యాలీకి సంబంధించినది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూసర్ ‘08 డిసెంబర్ 2020’ నాడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టు తెలిసింది. ‘Sikhs in America chanted Long live Imran Khan’ అనే టైటిల్ తో ఈ వీడియోని ఆ యూసర్ యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, పోస్టులో షేర్ చేసిన అదే వీడియోని పాకిస్తాన్ కి చెందిన ‘Siasat.pk’ న్యూస్ వెబ్ సైట్ తమ ట్వీట్ లో షేర్ చేసినట్టు తెలిసింది. అమెరికా లో నివసిస్తున్న సిక్కులు పాకిస్తాన్ దేశాన్ని సపోర్ట్ చేస్తూ ‘Long Live Imran Khan, Punjab will become Khalistan and Kashmir becomes Pakistan’ అనే నినాదాలు చేసినట్టు ఈ ట్వీట్ లో పేర్కొనారు.
ఇదే వీడియోని పాకిస్తాన్ సినియర్ నాయకుడు, పంజాబ్ రాష్ట్ర ఆహార మంత్రీ, అబ్దుల్ ఆలిమ్ ఖాన్ తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసారు. అమెరికా లో నివసిస్తున్న సిక్కులు, పాకిస్తాన్ ప్రధానమంత్రీ ఇమ్రాన్ ఖాన్ ని సపోర్ట్ చేస్తూన్న దృశ్యాలని తన పోస్టులో తెలిపారు.
ఈ వీడియో గురించి మరింత సమాచారం కోసం వెతకగా, ఈ వీడియో 2019 నుండి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో భారత దేశంలో రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, అమెరికా దేశంలో పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ సిక్కులు నిర్వహించిన ఆందోళన వీడియోని భారత దేశంలో రైతుల చేస్తున్న ఆందోళనలగా షేర్ చేస్తున్నారు.