Fake News, Telugu
 

హల్‌కట్టా షరీఫ్‌ దర్గా యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలుకు ముస్లింలు దర్గా చిత్రాలతో అలంకరణ చేస్తున్న వీడియోని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు

0

హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళే రైలును ముస్లింలు దర్గా బోర్డులతో ముస్తాబు చేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళే రైలును ముస్లింలు దర్గా బోర్డులతో అలంకరించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): కర్ణాటక కాలబురగి జిల్లాలోని హల్‌కట్టా షరీఫ్‌ దర్గాలో హజరత్ ఖ్వాజా సయ్యద్ మహమ్మద్ బాదేశ ఖ్వాద్రి చిస్తి యమని 43వ వార్షికోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుండి వాడి జంక్షన్ వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలుకు యాత్రికులు అలంకరణ చేసిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. చార్ ధామ్ యాత్ర మరియు గంగ పుష్కారాల సందర్భంగా కూడా భారతీయ రైల్వే ప్రత్యేక రైలులను ఏర్పాటు చేసింది. వీడియోలోని రైలు హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళడం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, మరొక రైలుని ఇదే తరహాలో అలంకరించిన వీడియో ఒకటి దొరికింది. హల్‌కట్టా షరీఫ్‌కి వెళుతున్న రైలును దర్గా చిత్రాలతో అలంకరించిన దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, వీడియోలోని అదే రైలు దృశ్యాలని చూపిస్తున్న వీడియోని 02 ఆగస్టు 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హజరత్ ఖ్వాజా సయ్యద్ మహమ్మద్ బాదేశ ఖ్వాద్రి చిస్తి యమని 43వ వార్షికోత్సవాల వేడుకల దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేశారు.

హజరత్ ఖ్వాజా సయ్యద్ మహమ్మద్ బాదేశ ఖ్వాద్రి చిస్తి యమని 43వ వార్షికోత్సవం సందర్భంగా హల్‌కట్టా షరీఫ్‌ దర్గాకు వెళ్ళే యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) 01 ఆగస్టు 2023 నాడు హైదరాబాద్ నుండి వాడి జంక్షన్ వరకు ప్రత్యేకంగా నాలుగు స్పెషల్  రైలులను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. హల్‌కట్టా షరీఫ్‌ కర్ణాటక రాష్ట్రం కాలబురాగి జిల్లాలో ఉంది. ఇవే రైలు దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ఇదే విషయం రిపోర్ట్ చేస్తూ ‘గుల్బర్గా టైమ్స్’ ఇటీవల పబ్లిష్ చేసింది.  

ప్రతి సంవత్సరం హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్ళే యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఇదే విధంగా ప్రత్యేక రైలులను ఏర్పాటు చేస్తూ వస్తుంది. ఈ ప్రత్యేక రైలులకు యాత్రికులు దర్గా బోర్డులు మరియు ఇతర ప్లకార్డులు తగిలించి అలంకరిస్తారు. హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్ళే ప్రత్యేక  రైలులను దర్గా బోర్డులతో అలంకరించిన పాత వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చార్ ధామ్ యాత్ర మరియు గంగ పుష్కారాల సందర్భంగా కూడా భారతీయ రైల్వే ప్రత్యేక రైలులను ఏర్పాటు చేసింది. పోస్టులో తెలుపుతున్నట్టు వీడియోలోని రైలు హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళడం లేదు.

చివరగా, హల్‌కట్టా షరీఫ్‌ దర్గాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలుకు యాత్రికులు అలంకరణ చేస్తున్న వీడియోని ముస్లింలు హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళే రైలును దర్గా బోర్డులతో అలంకరించిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll