Fake News, Telugu
 

ఈ వీడియో అలిపిరిలో ఉన్న తిరుమల-తిరుపతి దేవాలయం యొక్క నమూనా ఆలయానిది, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానిది కాదు

0

‘తిరుమలలో ఉన్న వెంకంటేశ్వర స్వామి గుడిలో భక్తులు లేనప్పుడు స్వామివారిని డైరెక్టుగా దర్శించుకునే అనుగ్రహం కలిగినది…’ అని ఒక గుడిలోపల చిత్రీకరించిన వీడియో కలిగిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.

క్లెయిమ్: తిరుమలలో ఉన్న వెంకంటేశ్వర స్వామి గుడిలో భక్తులు లేనప్పుడు తీసిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న గుడి అలిపిరిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క నమూనా ఆలయం. కొన్నాళ్ల కిందట కూడా ఈ నమూనా దేవాలయంలో చిత్రించిన వీడియో ఒకటి వైరల్ అయినప్పుడు, తిరుమలలో ఉన్న గర్భ గుడిలోకి అసలు కెమెరాలను అనుమతించరని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చెప్పారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని వీడియో కింద ఉన్న కామెంట్స్ పరిశీలించగా, వీడియోలోని దృశ్యాలు అలిపిరిలో నమూనా ఆలయానివి అని ఒకరు రాసారు. దీని ఆధారంగా తీస్కొని ఇంటర్నెట్లో వెతకగా వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలను పోలి ఉన్న కొన్ని  వీడియోలు మరియు కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి.

అలిపిరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క నమూనా ఆలయం యొక్క దుస్థితి గురించి ‘ది హిందూ’ 2016లో ఒక  కథనం ప్రచురించారు. కథనం ప్రకారం ‘తిరుమల పుణ్యక్షేత్రంలో షూటింగ్ నిషేధించబడినందున, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో గుడిలో జరిగే ఆచారాల నమూనాలను ప్రసారం చేయడానికి ఏడు సంవత్సరాల క్రితం ఈ ప్రతిరూపాన్ని నిర్మించింది.’ ఇందులోని ఫొటోలో ఉన్న విద్యుత్ దీపాలు (శాండిలియర్), స్థంబాలు, వైరల్ వీడియోలో ఉన్న వాటితో సరిపోయాయి.

అలిపిరి నమూనా ఆలయంలో తీసిన యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్ వీడియోల దృశ్యాలు కూడా  వైరల్ వీడియోలో ఉన్న వాటితో మ్యాచ్ అవుతున్నాయి. ఆ వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ‘టీవీ9’ వారు ఈ నమూనా దేవాలయంలో చేసిన ఒక వీడియో రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు.

గూగుల్ మ్యాప్స్ లో  ఉన్న నమూనా ఆలయం యొక్క ఫోటోలు కూడా వైరల్ వీడియో అక్కడే చిత్రించారని నిర్దారిస్తున్నాయి. అసలు తిరుమల దేవాలయంలో వీడియోల చిత్రీకరణ అనుమతిస్తారా అని ఇంటర్నెట్లో వెతకగా, 2020లోని కొన్ని వార్తా కథనాలు లభించాయి. ఆ సమయంలో దేవాలయం లోపల తీసిన వీడియో అని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వీ. సుబ్బా రెడ్డి గర్భ గుడిలోపల ఎటువంటి వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియో అలిపిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియో వారి నమూనా ఆలయంలో చిత్రించింది అని స్పష్టం చేసారు. ఈ వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

చివరిగా, ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు తిరుమల తిరుపతి దేవాలయం యొక్క నమూనా ఆలయానివి, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానివి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll