హిందూ మత గురువులు తమని తామే అవమానించుకుంటున్నారు అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో చిన జీయర్ స్వామి తాను నాస్తికుడినని మరియు హిందువులు అందరూ దౌర్భాగ్యులు అని చెప్తున్నట్లు చూడవచ్చు. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: చిన జీయర్ స్వామి తాను నాస్తికుడినని మరియు హిందువులు అందరూ దౌర్భాగ్యులు అని చెప్తున్న వీడియో.
ఫాక్ట్: ఈ వీడియోలో చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను అసందర్భంగా క్లిప్ చేయడం జరిగింది. పూర్తి వీడియోలో ఆయన, “హిందువులను కాఫిర్లుగా అనుకోను. మనది చాలా గొప్ప జాతి” అన్నారు. అలాగే తాను నాస్తికుడినని చెప్పిన క్లిప్ లో కూడా ఆయన చెప్తున్నది ఈ.వీ. రామస్వామి (పెరియార్), పెద్ద జీయర్ మధ్య జరిగిన సంభాషణలో రామస్వామి చేసిన వ్యాఖ్యలు మాత్రమే. కావున ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
క్లిప్ 1:
ముందుగా చిన్న జీయర్ స్వామి ‘హిందువులు అందరూ దౌర్భాగ్యులు’ అని చెప్తున్నట్లు ఉన్న వీడియో క్లిప్ యొక్క పూర్తి వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో ఆయన ఇలా అన్నారు, “భరత వంశం లో నుంచి వచ్చిన వాళ్ళ౦ మనమందరం. మన జాతి పేరు ‘భారత జాతి’, ‘భరత జాతి’. నిన్న మొన్న వచ్చి మనకి పెట్టారు పేరు నువ్వు హిందూ అని, మనల్ని తిట్టడానికి. ఫలానా లోయలో నుంచి వచ్చారు అందుకని హిందూ అని పేరు పెట్టారు. కానీ, కాదు. అక్కడ పుడితే మీకు అదే పేరు ఉండేది ఏమో, కానీ మీరు (వీక్షకులు) అక్కడ పుట్టలేదే, గోదావరి, కృష్ణ లేదా ఇతర నదుల దగ్గర పుట్టి ఉంటారు. సింధు లోయలోనుంచి వచ్చిన వారు అంటే మీ చరిత్ర అంతా శూన్యం. మీ చరిత్ర కొంత కాలం వరకు వరకు వెళ్ళి అక్కడ ఆగి పోయింది అని అర్థం. అప్పుడు మీరు చెప్పుకునే రామాయణం, భారతం, వేదాలు ఇవన్నీ పూర్వ యుగాలకు అని చెప్పడం పచ్చి అబద్ధం, అశాస్త్రీయం అంటారు. విగ్రహారాధనను వ్యతిరేకించే వారు విగ్రహారాధనను చేసి వారిని ‘కాఫిర్’ అని చెప్పడానికి వాడిన పదం (హిందూ) అది. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు, అవునా? నేనలా అనుకొను. ఈ దేశంలో, జాతిలో జన్మిస్తే అదృష్టం అని స్వర్గంలో ఉన్న దేవతలు కూడా అనుకుంటారు. అంతా గొప్ప జాతి మనది.”
ఇక ఇదే విషయం గురించిన ఆయన ఇచ్చిన పూర్తి వివరణ ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో 8:20 నిముషాల నుంచి రామాయణ మహా భారత గ్రంధాల గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు, “వాల్మీకి, వ్యాసులు ఇచ్చింది కేవలం భారత దేశ చరిత్ర అనుకోకండి. అందుకునే మనం హిందూ అనే పదం ఉపయోగించము. కొందరు వ్యక్తులు నన్ను అడిగారు, నేను ‘హిందూ’ పదము వాడటం లేదు అని, అందుకు కారణం, బ్రిటిష్ వాడు ఆ పదం కనిపెట్టి మన మీద చాలా చక్కగా పెట్టాడు. గతి లేకపోవడం వలన ఆ రోజు వివేకానందుడు ఆ పదం చెప్పుకోవలసి వచ్చింది. కానీ మన జాతిని ఆ పదంతో చెప్పుకోవడానికి పనికిరాదు. ఆ పదంతో చెప్పుకుంటే మన పీకను మనమే కోసుకున్నట్లు అనమాట. ఈ పదం ఎలా వచ్చిందో కొన్ని రకాలుగా చెప్తారు. సింధూ నాగరికత నుంచి వచ్చినది అని అంటారు. అంటే 5000 సంవత్సరాల క్రితం ఉన్న సింధూ నాగరికత తప్ప భారతదేశంలో ఇక వేరే పురాతన నాగరికతలు లేవా? ఈ దేశానికి, ఈ జాతికి నాగరికత లేదా? మీరు అందరూ సింధు నదిలో నుంచి వచ్చారా? గోదావరి, కృష్ణ లేదా ఇతర నదుల దగ్గర పుట్టి ఉంటారు. ఆ లోయలో నుంచి వచ్చిన నాగరికతతో మీరు ఎందుకు గుర్తింపు పొందాలి? రెండవది, ‘స’ అక్షరం ‘హ’ గా మారింది, అందుకనే ‘సింధు’ పదం ‘హిందూ’ అయ్యింది అని అన్నారు. ఇది వాస్తవమా? అంతకుమందు లేదా ఇక్కడ ఏమి? అనేది మీరు (వీక్షకులు) ఆలోచించుకోవాలి”.
15:45 నిముషాల నుంచి ఇలా అన్నారు: “అసలు 1000 సంవత్సరాల క్రితం ఈ పదం (హిందూ) ఉనికిలో లేదు. విగ్రహారాధనను వ్యతిరేకించే పార్సీస్ లాంటి వారు విగ్రహారాధనను చేసి వారిని ‘కాఫిర్’ అని చెప్పడానికి వాడిన పదం. హిందూ అనే పదం మనల్ని చరిత్ర హీనులని చేయడం కోసం వచ్చింది. వేదాల, ఇతిహాసాలలో ఎక్కడా ఆ పదం లేదు. మత గురువులు ఎవరు కూడా వాడలేదు. నీ చరిత్రను చెప్పుకోవాలి అనుకుంటే వంశం పేరు చెప్పుకోవచ్చు. నీ వంశం పేరు ‘భరత వంశం’. నీ జాతి పేరు ‘భరత జాతి’. నీకొక ప్రమాణం ఉంది, అది వేదాలు. అందులో వివిధ దేవుళ్లకు పూజించవచ్చు.”
క్లిప్ 2 :
ఇక చిన జీయర్ స్వామి తాను నాస్తికుడినని చెప్తున్న క్లిప్ యొక్క పూర్తి వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో పెద్ద జీయర్ స్వామి మరియు ఈ.వీ. రామస్వామి (పెరియార్)కు మధ్య జరిగిన సంభాషణను ఆయన చెప్తున్నారు,
“రామ స్వామి: నేను పెద్ద భక్తున్ని కాదు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు.
పెద్ద జీయర్: ఎందుకు?
రామ స్వామి: నాకు చిన్న వయసులో మా ఇంట్లో కాఫీ కాచినా, గణపతికి నివేదన చేసి తాగే వారు, ఒకసారి గణపతి విగ్రహం పైన బొద్దింక పాకుతుంది. కొంత సేపు చూశా ఆయన బొద్దింకను తొలగించుకుంటాడు ఏమో అని, కానీ ఏమీ చేయలేదు. అప్పుడు నాకు ఏం అనిపించింది అంటే, ఒంటిమీద ఉండే కనిపించే బొద్దింకనే తొలగించుకోలేని వాడు కనిపించని మన మీద ఉండే పాపాలని ఏం పోగొడతాడు. అప్పటి నుంచి నేను నాస్తికుడని అయిపోయాను.”
చివరిగా, అసందర్భంగా క్లిప్ చేసిన వీడియోలను జతచేస్తూ చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.