Fake News, Telugu
 

ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ విరాళం ఇచ్చింది మథురలో బాంకే బిహారీ ఆలయానికి, అయోధ్యలో ధర్మశాల నిర్మాణానికి కాదు

0

యశోద అనే మహిళ గత 30 సంవత్సరాలుగా మథురలోని శ్రీ బాంకే బిహారీ ఆలయం వద్ద భక్తుల చెప్పులు కాపలా కాయడం ద్వారా సంపాదించిన 51 లక్షల 10 వేల 25 రూపాయలను అయోధ్యలో దేవాలయ ధర్మశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చినట్టు చెప్తున పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మథురలో ఆలయం వద్ద చెప్పులు భద్రపరిచే వృద్ధ మహిళ అయోధ్యలో శ్రీరామ దేవాలయ ధర్మశాల నిర్మాణానికి 51 లక్షల విరాళంగా ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): వైరల్ పోస్టులో పేర్కొనబడిన వృద్ధ మహిళ అయోధ్యలో దేవాలయ ధర్మశాల నిర్మాణానికి విరాళం ఇచ్చినట్టు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. అయితే ఇదే మహిళ 2017లో మథురలోని ఆలయం వద్ద భక్తుల చెప్పులు కాపలా కాయడం మరియు తన ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో, బృందావన్‌లో గోశాల మరియు ధర్మశాల నిర్మించడానికి, బాంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించడానికి రూ.40 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు రిపోర్ట్స్ లభించాయి. కావున ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

తగిన కీవర్డ్స్ ఉపయోగించి వైరల్ క్లెయిమ్ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ పోస్టులో పేర్కొనబడిన వృద్ధ మహిళ అయోధ్యలో దేవాలయ ధర్మశాల నిర్మాణానికి విరాళం ఇచ్చినట్టు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఈ క్రమంలోనే  కొన్ని రిపోర్ట్స్ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం మధ్యప్రదేశ్‌లోని కట్నీకి చెందిన 70 ఏళ్ల ఫూల్‌వతి, 1982లో తన భర్త మరియు కూతురు మరణం తరువాత ఉత్తరప్రదేశ్‌లోని మథురకు వచ్చి౦ది. అప్పటి నుండి ఆమె బాంకే బిహారీ ఆలయానికి వచ్చే సందర్శకుల పాదరక్షలను భద్రపరుస్తూ వారి నుండి విరాళాలు సేకరిస్తుంది, ఇలా సంపాదించి పొదుపు చేసిన డబ్బుతో మరియు మధ్యప్రదేశ్‌ కట్నిలో తన ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో, బృందావన్‌లో గోశాల, ధర్మశాల నిర్మించడానికి మరియు బాంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించడానికి రూ. 40 లక్షలు విరాళంగా ఇచ్చింది.

నిశితంగా గమనిస్తే వైరల్ పోస్టులోని వృద్ధ మహిళ మరియు ఈ రిపోర్ట్స్ లో పేర్కొనబడిన మహిళ ఒక్కరే అని అర్థమవుతుంది. దీన్ని బట్టి వైరల్ ఫోటోలోని వృద్ధ మహిళ పేరు ఫూల్‌వతి అని, ఈమె మథురలోని బాంకే బిహారీ ఆలయానికి మరియు బృందావన్‌లో గోశాల కోసం విరాళం ఇచ్చింది అని నిర్ధారించవచ్చు.

చివరగా, వైరల్ పోస్టులని ఫోటోలో కనిపిస్తున్న మహిళ విరాళం ఇచ్చింది మథురలోని బాంకే బిహారీ ఆలయానికి, అయోధ్యలో ధర్మశాల నిర్మాణానికి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll