Fake News, Telugu
 

మోటార్ వాహన (సవరణ) చట్టం, 2019 ప్రకారం 15 రోజుల్లోగా 100 రూపాయలు కడితే చాలాన్ రద్దు అవుతుంది అనేది అవాస్తవం

0

“రోడ్డు పైన ఏదైనా వాహనం నడిపేటప్పుడు ఏదైనా ట్రాఫిక్ నియమాన్ని అతిక్రమించినా (లేదా) మీ దగ్గర లైసెన్సు మరియు ఇతర డాక్యుమెంట్లు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు/RTO మీకు జరిమానా వేస్తే మీరు వెంటనే చెల్లించాల్సిన పని లేదు. 15 రోజుల లోపు మీరు సంబంధిత అధికారికి చూపిస్తే కేవలం ₹100 కట్టించుకొని మీ చల్లాన్ ను రద్దు చేస్తారు”  అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మోటార్ వాహన (సవరణ) చట్టం, 2019 ప్రకారం లైసెన్సు మరియు ఇతర డాక్యుమెంట్లు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు/RTO జరిమానా వేస్తే, 15 రోజుల లోపు డాక్యుమెంట్లు సంబంధిత అధికారికి చూపిస్తే కేవలం ₹100 కట్టించుకొని జరిమానాను రద్దు చేస్తారు.

ఫాక్ట్: 2019లో సవరించిన చట్టం ప్రకారం వాహనానికి సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను తప్పనిసరిగా వాహనాన్ని నడిపే సమయంలో కలిగి ఉండాలి (ఒరిజినల్ లేదా డిజిటల్). అయితే డిజిటల్ డాక్యుమెంట్లను అన్ని రాష్ట్రాల అధికారులు అన్ని సందర్భాలలో ఆమోదించట్లేదు. ఒక వేల ఏదైనా ట్రాఫిక్ నియమం పాటించకుంటే వాహన దారుడికి చాలాన్ ( లేదా e -చాలాన్) విధిస్తారు. మరియు ఒక్కో రాష్ట్రంలో ఈ చట్టం అనేక మార్పులతో అమలులో ఉంటుంది. అయితే, 2013లో కూడా ఇటువంటి ప్రచారం జరిగినప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు దీనిని నిరాధారం అని  తేల్చారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా మేము ఇదే తరహా పోస్టు 2013 నుంచి వైరల్ అవుతున్నట్లు గుర్తించాము. ఈ విషయంపైన స్పష్టతనిస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు ఈ విధంగా చెప్పారు, “ఎవరైనా ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే చలాన్ వ్రాయబడుతుంది మరియు జరిమానా మొత్తాన్ని చెల్లించమని అడుగుతారు. వ్యక్తి వద్ద డబ్బు లేకపోతే, అతను తన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) లేదా డ్రైవింగ్ లైసెన్స్ ను సరండర్ చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర ఈ డాక్యుమెంట్లు కూడా లేకుంటే అతని వాహన౦ అదుపులోకి తీసుకోని చలాన్ జారీ చేయబడుతుంది. అతను అదే రోజు జరిమానా చెల్లించాలనుకుంటే పోలీసు స్టేషన్‌లో చెల్లించి తన పత్రాలు మరియు వాహనాన్ని తిరిగి పొందవచ్చు . అతను మరుసటి రోజు లేదా ఆ తర్వాత చెల్లించినట్లయితే, అతను ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌లో చెల్లించాలి మరియు కాంపౌండింగ్ బూత్ నుండి అతని డాక్యుమెంట్లు పొందాలి. కాంపౌండింగ్ బూత్ జారీ చేసిన చెల్లించిన చలాన్ స్లిప్‌ను చూపించి సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి వాహనాన్ని పొందవచ్చు. ఒకవేళ వ్యక్తి తనపైన అన్యాయంగా జరిమానా వేశారు అని కోర్టులో కేసు వేస్తే, కోర్టు ఆ వ్యక్తిదే తప్పు అని భావిస్తే, అతను జరిమానా కోర్టులో చెల్లించాలి మరియు కేసు అతనికి అనుకూలంగా వస్తే అతను ఏమీ  చెల్లించాల్సిన అవసరం లేదు, కోర్టు అతనికి డాక్యుమెంట్లు లేదా వాహనాన్ని తిరిగి ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తుంది.”

ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పోస్టులోని సమాచారం 2019 లో సవరించిన భారత్ మోటార్ వాహన (సవరణ) చట్టం లో ఉన్నది అంటూ చెప్తున్నారు. ఇక, ఈ చట్టంలో ఏముందో అని చూడగా,  సెక్షన్ 130(3) ప్రకారం, వాహన యజమాని లేదా అతను లేనప్పుడు డ్రైవర్ లేదా వాహనానికి బాధ్యత వహించే ఇతర వ్యక్తి సంబంధిత అధికారి డిమాండ్ చేస్తే, వాహనం యొక్క ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ మరియు వాహనం రవాణా వాహనం అయితే, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మరియు పర్మిట్ ను కూడా చూపించాల్సి ఉంటుంది; ఏదైనా ఒకటి లేదా అన్ని సర్టిఫికేట్లు లేదా పర్మిట్ అతని వద్ద లేకుంటే, అతను అధికారి డిమాండ్ చేసిన తేదీ నుండి పదిహేను రోజులలోపు, వ్యక్తిగతంగా ధృవీకరించబడిన వాటి ఫోటో కాపీలను సమర్పించాలి లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సంబంధిత అధికారికి పంపాలి.

అయితే, ఈ నియమం కేవలం ఇన్షూరెన్స్ సర్టిఫికేట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మరియు పర్మిట్ ల గురించి మాత్రమే చెబుతోంది. మరియు దీనిని 1994 లోనే సెక్షన్ 39 తో మార్చబడింది. దాని ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాన్ని నడపడం నేరంగా పరిగణిస్తారు.

మరియు ఈ చట్టం రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నందున, రాష్ట్రాలు తమ స్వంత నియమాలను కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు తెలంగాణలో తాజాగా సవరించిన జరిమానా రేట్లను ఇక్కడ చూడవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన వాటిని ఇక్కడ చూడవచ్చు. ఇక వివిధ రాష్ట్రాలు, ఈ డాక్యుమెంట్‌లను డిజిటల్ కాపీ లుగా కూడా ఆమోదిస్తున్నాయి. అందుకు కొన్ని అప్లికేషన్లను కూడా రూపొందించడం జరిగినది.

చివరిగా, సవరించిన మోటార్ వాహన చట్టం ప్రకారం 15 రోజుల్లోగా 100 రూపాయలు కడితే చాలాన్ రద్దు అవుతుంది అనేది అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll