Fake News, Telugu
 

ఈ వీడియోలో ప్రతిపక్ష బృందంతో మాట్లాడుతున్న మెయిటీ మహిళ మోదీను మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది

0

మణిపూర్ వెళ్లిన అఖిల పక్షానికి అక్కడి ప్రజల నుండి సూటి ప్రశ్నలు వేశారంటూ ఒక మణిపూర్ మహిళ ప్రతిపక్ష ఎంపీలతో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. “ఏ రోజు మేము ఉన్నామా పోయామా అని చూడని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు?ఒక మహిళని తగలబెడితే ఎందుకు రాలేదు మా భద్రత మోదీ జీ చూసుకుంటారు,మీ రాజకీయాలు ఇక్కడ వద్దు”  అని ఆ మహిళ మొహం మీద కొట్టినట్లు చెప్పిందని ఈ వీడియోను షేర్ చేస్తూ చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్ వెళ్లిన అఖిల పక్షానికి అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): జులై 2023 చివర్లో 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన సుమారు 21 మంది ఎంపీలు మణిపూర్ రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను పరిశీలించడానికి రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ వీడియో ఆ పర్యటనకు సంబంధించిందే. ఈ వీడియోలో మాట్లాడుతున్న మెయిటీ వర్గానికి చెందిన మహిళ. ఆమె మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారులు మరియు కుకీ తీవ్రవాదులు చేసిన అరాచకాలను వివరించే ప్రయత్నం చేసింది. ఐతే ఈ సందర్భంలో ఆ మహిళ ఎక్కడ కూడా మోదీని సమర్ధించలేదు, నిజానికి ఆ ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని మరియు మోదీని విమర్శించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

జులై 2023 చివర్లో 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన సుమారు 21 మంది ఎంపీలు మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించారు. హింసతో అల్లాడుతున్న మణిపూర్ రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను పరిశీలించడానికి ఈ ప్రతినిధి బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రకటన కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంతో ఈ పర్యటన చేసింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఈ పర్యటన సమయంలో ఎంపీలు స్థానికులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించినవి. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఈ వీడియోలో ఆ స్థానిక మహిళ ఆ ఎంపీలను ఎందుకు వచ్చారని ప్రశ్నించడం గానీ మోదీని సమర్ధించడం గానీ చేయలేదు. వీడియోను జాగ్రత్తగా విన్నప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది.

నిజానికి ఈ వీడియో రిపబ్లిక్ టీవీ ప్రతిపక్ష ఎంపీలు చేసిన పర్యటన రిపోర్ట్ చేసిన కథనం నుండి సేకరించింది. రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన పూర్తి ఫూటేజ్ ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ రిపోర్ట్‌లో ఎక్కడ కూడా స్థానికులు ప్రతిపక్ష బృందాన్ని ప్రశ్నించినట్టు పేర్కొనలేదు.  ఈ వీడియోలో మాట్లాడుతున్న మెయిటీ వర్గానికి చెందిన మహిళ. ఆమె మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారులు మరియు కుకీ తీవ్రవాదులు చేసిన అరాచకాలను వివరించే ప్రయత్నం చేసింది. ఐతే ఈ సందర్భంలో ఆ మహిళ ఎక్కడ కూడా మోదీని సమర్ధించలేదు, నిజానికి ఆ ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని మరియు మోదీని విమర్శించింది.

‘కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని, ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రభుత్వం ఎందుకు చర్చించలేదని ప్రశ్నించింది.  ప్రధాని మోదీ ఇద్దరు కూకిమహిళల వీడియో బయటికి వచ్చిన తరవాతే ఎందుకు మాట్లాడారు, అంతకుముందు ఈ విషయంపై ఎందుకు స్పందించలేదంటూ కూడా ఆ మహిళ ప్రశ్నించింది. మోదీ నిజంగా మహిళల పట్ల జరిగే అన్యాయానికి వ్యతిరేకమైతే అంతకుముందు ఒక స్వతంత్ర సమరయోదుడి భార్యను తగలబెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించింది.’

ప్రతిపక్ష ఎంపీలు ఈ పర్యటనలో స్థానికులతో మాట్లాడిన మరికొన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ పర్యటనలో స్థానికులు ప్రతిపక్ష బృందాన్ని ప్రశ్నించినట్టు రిపోర్ట్స్ ఐతే లేవు. దీన్నిబట్టి మెయిటీ మహిళ తమ బాధలు చెప్పుకున్న వీడియోను వక్రీకరించి ప్రతిపక్ష బృందాన్ని ప్రశ్నించిందంటూ షేర్ చేస్తున్నారని స్పష్టమువుతుంది.

చివరగా, ఈ వీడియోలో ప్రతిపక్ష బృందంతో మాట్లాడుతున్న మెయిటీ మహిళ మోదీను మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Share.

About Author

Comments are closed.

scroll