Fake News, Telugu
 

రాయ్‌పుర్‌ కోవిడ్ మృతదేహాలకు సంబంధించిన వీడియోని గుంటూరు, మహారాష్ట్రకి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒక హాస్పిటల్ లో పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఉన్న వీడియోను షేర్ చేస్తూ, ఈ వీడియో గుంటూరు GGH హాస్పిటల్ కి సంబంధించిందని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియా షేర్ అవుతోంది. అలాగే ఇదే వీడియోని మహారాష్ట్రకి సంబంధించిందని ఇంకొన్ని సోషల్ మీడియా పోస్టులు షేర్ అవుతున్నాయి. ఐతే ఈ కథనం ద్వారా ఈ పోస్టులలో ఎంత వరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహారాష్ట్ర మరియు గుంటూరు GGH హాస్పిటల్ లో పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఉన్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలోని మృతదేహాలు. ఈ వీడియో రాయ్‌పుర్‌లోని అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించిందని తెలుపుతూ పలు వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. ఈ వీడియోకి మహారాష్ట్ర లేదా గుంటూరుకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ పోస్టులోని వీడియోని మరియు వీడియో స్క్రీన్ షాట్స్ లోని ఫోటోలను ఏప్రిల్ 2021లో ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. NDTV, టైమ్స్ అఫ్ ఇండియా మొదలైన వార్తా సంస్థల కథనాల ప్రకారం ఈ వీడియోలో చూపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలోని మృతదేహాలు.

ఇదే వీడియోని రాయ్‌పుర్‌లోని అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలోని మృతదేహాలు అని తెలుపుతున్న మరొక కథనం ఇక్కడ చూడొచ్చు. రాయ్‌పుర్‌లోని అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్ లోని మృతదేహాలకు సంబంధించి ANI కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ చేసిన ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.ఇండియా టుడే, రిపబ్లిక్ వరల్డ్ కూడా అంబేద్కర్ హాస్పిటల్ లో పేరుకుపోయిన మృతదేహాలకు సంబంధించి కథనాలు ప్రచురించింది. వీటన్నిటి ఆధారంగా పోస్టులోని వీడియో మహరాష్ట్రలోని హాస్పిటల్ దో లేక గుంటూరు GGH హాస్పిటల్ కి సంబంధించిదో కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

దేశంలో కోవిడ్ కేసులు మరియు మరణాలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, రాయ్‌పుర్‌ కోవిడ్ మృతదేహాలకు సంబంధించిన వీడియోని గుంటూరు మరియు మహారాష్ట్రకి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll