బెంగాల్‌లో ముస్లింలు పోలీసులపై ఇలా దాడి చేస్తున్నారని ఒక ఫోటోను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బెంగాల్‌లో పోలీసులపై ముస్లింలు చేస్తున్న దాడి యొక్క ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటో 2016 నాటిది; ఇటీవల తీసింది కాదు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వీధుల్లో అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిని తొలగించడానికి వచ్చిన పోలీస్ అధికారిపై ఒక రోడ్ పక్కన అమ్ముకునే వ్యాపారి (అతను ముస్లిం కాదు) దాడి చేశాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో కనీసం 2020 నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్న ఒక న్యూస్పేపర్ క్లిప్పింగ్ లో దొరికింది. ఈ పేపర్ క్లిప్పింగ్ ప్రకారం, ఒక రోడ్ పక్కన అమ్ముకునే వ్యాపారి అక్కడ ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. రాజస్థాన్‌లోని ఘంటాఘర్, జోధ్‌పూర్ వీధుల సమీపంలో అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిని తొలగించడానికి వచ్చిన పోలీస్ అధికారిపై ఇలా దాడి జరిగినట్టు తెలుస్తుంది.
సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్‌లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించి 2016లో ప్రచురితమైన నుండి అనేక వార్తా కథనాలు (ఇక్కడ మరియు ఇక్కడ) దొరికాయి. దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం, హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యాపారి ప్రేమ్‌చంద్ మాలి (ధర్మేంద్ర కుమారుడు), అతను నగోరియా బేరా ప్రాంతవాసి. ఆ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ పేరు శోభరాం.
ఇప్పుడు జోధ్‌పూర్ పోలీస్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శోభరాం, 2016లో తనపై దాడి చేసిన వ్యక్తి ముస్లిం కాదని ‘BOOM’కి స్పష్టంచేసాడు.
చివరగా, 2016లో రాజస్థాన్‌లో ఒక పోలీస్ అధికారిపై దాడి చేస్తున్నప్పుడు తీసిన ఫోటోను బెంగాల్‌లో ముస్లింలు పోలీసులపై చేస్తున్న దాడి అంటున్నారు.