Fake News, Telugu
 

గత సంవత్సరం అహ్మదాబాద్‌లో పక్షులు గుంపులుగా వచ్చిన వీడియోని ఇప్పుడు బెంగుళూరు విమానాశ్రయానికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

బెంగళూరు విమానాశ్రయం సమీపంలో పక్షులన్నీ కలిసి ఉప్పెనలా వస్తున్నాయంటూ ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఒక వీడియోని తమ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేయగా, ఈ పోస్టుని సోషల్ మీడియా వినియోగదారులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బెంగళూరు విమానాశ్రయం సమీపంలో పక్షులన్నీ కలిసి ఉప్పెనలా వస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోని గత సంవత్సరం ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ దగ్గర ఒక వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అలా ఈ వీడియో వైరల్ అయ్యింది. పలు వార్తా సంస్థలు కూడా గతంలో ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి బెంగుళూరుకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో గత సంవత్సరం అహ్మదాబాద్‌లోని నదీ తీరానా తీసింది. టైమ్స్ అఫ్ ఇండియా ఇదే వీడియోని 13 ఫిబ్రవరి 2020 రోజునే రిపోర్ట్ చేసింది. ఇలా వందల సంఖ్యలో పక్షులు గుంపులుగా తిరగడాన్ని ముర్మురేషన్ అంటారని ఈ కథనంలో పేర్కొనగా, ఈ వీడియో ఏ రోజు చిత్రీకరించారన్న విషయానికి సంబంధించి ఈ కథనంలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఇదే వీడియోని గత సంవత్సరం ఏప్రిల్‌లోనే షేర్ చేసింది. పైగా సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాంతంలో పక్షులు ఇలా గుంపులుగా రావడమనేది తరచూ జరుగుతుందని వారు ఈ ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.

ఇదే వీడియోని ఒక ఫేస్ బుక్ వినియోగదారుడు 12 ఫిబ్రవరి 2020 రోజున తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసాడు, ఐతే వీడియో క్రెడిట్స్‌లో మాత్రం చిరాగ్ తూమర్ అనే పేరుని పేర్కొన్నాడు. దీని ఆధారంగా వెతకగా చిరాగ్ తూమర్ అనే పేరుగల ట్విట్టర్ ఎకౌంటులో కూడా ఇదే వీడియో అప్లోడ్ చేసి ఉంది. BOOM అనే ఫాక్ట్ – చెకింగ్ ఏజెన్సీ చిరాగ్ తూమర్‌ని సంప్రదించగా, ఈ వీడియో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సమీపంలోని సబర్మతి రివర్ ఫ్రంట్ దగ్గర తానే చిత్రీకరించినట్టు అతను తెలిపాడు. దీన్ని బట్టి ఈ వీడియో పాతదని, ఈ వీడియోకి బెంగుళూరుకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, గత సంవత్సరం అహ్మదాబాద్‌లో పక్షులు గుంపులుగా వచ్చిన వీడియోని ఇప్పుడు బెంగళూరు విమానాశ్రయానికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll