ఒక మహిళ బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి ‘బిర్యానీలో పేడ కలుపుకుని తినాలనుకునే ఈమెను ఇలా ప్రభావితం చేసిన ఘనత ఎవరిది’ అనే కాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఒక మహిళ బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తింటున్న వీడియో.
ఫాక్ట్(నిజం): వీడియోలో కనిపిస్తున్న మహిళ బెంగాల్‌కు చెందిన ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. వినోదం/డబ్బుల కోసం వీడియోలు రూపొందిస్తూ ఉంటుంది. ఐతే వైరల్ వీడియోలో నిజానికి ఆ మహిళ బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తినలేదు. పైగా వీరికి కంటెంట్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానో/వ్యతిరేకంగానో లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు నిజానికి ఆ మహిళ బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తినలేదు, కేవలం అలా నటించింది. ఈ వీడియోకు సంబంధించి సమాచారం కోసం వెతకగా వీడియోలో కనిపించే మహిళకి సంబంధించిన సోషల్ మీడియా పేజీలు మాకు కనిపించాయి (Arajit & Riya Vlogs & Riya Arajit).
ఈ పేజీలలోని సమాచారం ప్రకారం ఆమె బెంగాల్‌కు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ అని తెలిసింది. వీరు రూపొందించిన చాలా వీడియోలు ఈ పేజీలలో అందుబాటులో ఉన్నాయి. కాని ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఈ పేజీలలో అందుబాటులో లేదు. ఐతే ఈ వీడియోకు సంబంధించి వివరణ కోసం మేము వారిని సంప్రదించగా వారు ఈ విషయానికి సంబంధించి వివరణ ఇస్తూ మరో వీడియోను పోస్ట్ చేసారు.
తాను నిజంగా బిర్యానీలో పేడ కలుపుకొని తినలేదని, ఈ వీడియోను కేవలం వినోదం/ఫేమస్ అవ్వడం కోసం మాత్రమే తప్ప ఇతర కారాణాలేవి లేవని స్పష్టం చేసారు. ఈ వీడియోను తమ సోషల్ మీడియా నుండి తొలిగించామని కూడా తెలిపారు.
వీరి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా, వీరు రూపొందించే కంటెంట్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానో/వ్యతిరేకంగానో లేదు. దీన్నిబట్టి ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి రాజకీయ పార్టీ/రాజకీయా పరిస్థితులకు సంబంధం లేదని అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తింటున్నట్టు వినోదం కోసం రూపొందించిన వీడియోను రరాజకీయ పరిస్థితులకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.