Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

హాస్పిటల్ సిబ్బంది ఆనందంగా బయటికి వస్తున్న ఈ వీడియో న్యూజీలాండ్ ది కాదు, ఇటలీది

0

న్యూజిలాండ్‌ లో చివరి కోవిడ్-19 పేషెంట్ డిశ్చార్జ్ అయిన అనంతరం అక్కడి వైద్య సిబ్బంది కోవిడ్-19 వార్డ్ నీ మూసివేస్తున్నారని చెప్తూ ఒక వీడియో ని ఫేస్‌బుక్‌లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలో, వైద్య సిబ్బంది సంతోషంగా వార్డు నుండి బయటకు వస్తూ వారి హెడ్ క్యాప్స్ ని తొలగిస్తుంటారు. అనంతరం, ఇద్దరు సిబ్బంది ఆ వార్డు యొక్క తలుపులను మూస్తారు మరియు మిగిలిన వారు చప్పట్లు కొడుతుంటారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: న్యూజీలాండ్ లో చివరి కోవిడ్-19 పేషెంట్ డిశ్చార్జ్ అయిన అనంతరం అక్కడి వైద్య సిబ్బంది కోవిడ్-19 వార్డ్ నీ మూసివేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో మాతేరా (ఇటలీ) లోని ఆసుపత్రి లో కోవిడ్-19 వార్డ్ ని వైద్య సిబ్బంది మూసివేస్తున్నప్పటిది. న్యూజిలాండ్ లో తాజాగా ఆక్టివ్ కోవిడ్-19 కేసులు లేవని అక్కడి ప్రభుత్వం ప్రకటించిందనే విషయం వాస్తవమే కానీ, పోస్టు లోని వీడియో ఆ దేశానిది కాదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

వీడియో యొక్క స్క్రీన్ షాట్ లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో ‘Matera News’ అనే ఫేస్‌బుక్ పేజ్ లో లభించింది. ఆ ఫేస్‌బుక్ పేజ్ లోని వివరణ లో వీడియో మాతేరా (ఇటలీ) లోని ‘మడోన్నా డెల్లే గ్రాజీ’ ఆసుపత్రి లో కోవిడ్-19 వార్డ్ ని మూసివేస్తున్నప్పటిది అని ఉంది. ‘మాతేరా’ ఇటలీలోని బాసిలికాటా ప్రాంతంలోని ఒక నగరం.

ఆ పేజ్ లో పేర్కొన్న ఆసుపత్రి (‘మడోన్నా డెల్లే గ్రాజీ’) పేరుతో ఫేస్బుక్ లో వెతికినప్పుడు, అలాంటి వీడియో లు చాలా లభించాయి. అంతేకాదు, ఆ ఆసుపత్రి లో పని చేసే ఒక నర్సు (‘ఇంఫెర్మీయారి’) అదే వీడియోని మరియు అందుకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ని తన అకౌంట్ లో పోస్టు చేశాడు. వీడియో గురించి అదే సమాచారాన్ని ‘Il Riformista’ అనే ఇటాలియన్ వార్తాపత్రిక కథనంలో కూడా చూడవచ్చు. 

న్యూజిలాండ్ లో తాజాగా ఆక్టివ్ కోవిడ్-19 కేసులు లేవని అక్కడి ప్రభుత్వం ప్రకటించిందనే విషయం వాస్తవమే కానీ, పోస్టు లోని వీడియో ఆ దేశానిది కాదు. 

చివరిగా, ఇటలీ దేశానికి సంబంధించిన వీడియో ని పోస్టు చేసి, ‘న్యూజీలాండ్ లో చివరి కోవిడ్-19 పేషెంట్ డిశ్చార్జ్ అయిన అనంతరం కోవిడ్-19 వార్డ్ నీ మూసివేస్తున్న వైద్య సిబ్బంది’ అని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll