Fake News, Telugu
 

ఉచితంగా లిఫ్ట్ ఇవ్వటం నేరం కాదు, ప్రయివేట్ వాహనాన్ని పర్మిట్ లేకుండా రవాణా వాహనంగా వాడటం నేరం

0

*లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే* అని చెప్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యబడుతోంది. ఇందులోని నిజానిజాలు ఏంటో తెలుసుకుందాం.

ముంబైకి చెందిన నితిన్ నాయర్‌కి జరిగిన అనుభవం గురించి ఈ పోస్ట్ చెప్తుంది. ఈ సంఘటన జూన్ 2018 లో జరిగింది. నితిన్ నాయర్ 18 జూన్ 2018 నాడు భారీ వర్షం కురుస్తున్నప్పుడు తన కారులో గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చారని, దాని మూలంగా తనకు ఎలా చలాన్ మరియు జరిమానా విధించబడిందో వివరిస్తూ, 22 జూన్ 2018 నాడు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ అప్పట్లో చాలా వైరల్  కూడా అయ్యింది. 

రోడ్డుపై నిలబడిన గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చినందుకు ట్రాఫిక్ పోలీసులు తనకు ఎలా చలాన్ జారీ చేశారో తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. తనపై మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 66 & 192 కింద కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నిజంగా నేరమా? మోటారు వాహనాల (MV)  చట్టం ఏమి చెబుతుంది? మనం ఈ ఆర్టికల్ ద్వారా వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.

క్లెయిమ్: గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం, ఆలా ఇచ్చినచో  జరిమానా కట్టాలిసిందే.

ఫాక్ట్ (నిజం): మోటారు వాహనాల (MV)  చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం సరైన అనుమతులు లేకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో రవాణా వాహనంగా వాడరాదు. అలా చేసినచో తగిన శిక్షార్హులు అవుతారు. అంతే కానీ లిఫ్ట్ ఇచ్చి డబ్బు ఏమి తీసుకోకపోతే అదేమీ నేరం కాదు. అంచేత ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

నితిన్ నాయర్  రాసిన పోస్ట్ కోసం  ఇంటర్నెట్‌లో  సరైన కీవర్డ్స్ తో వెతకగా మాకు అది లభించింది. ఆ పొస్ట్‌ని ఇప్పుడు వైరల్ అవుతున్న పొస్ట్‌ని  పోల్చినప్పుడు, కొన్ని తప్పులు ఉన్నా  కూడా, ఆయనకు జరిగిన సంఘటనను పొస్ట్‌లో పూర్తిగా వివరించారని అర్థం అవుతుంది. నితిన్ నాయర్ పూర్తి పోస్ట్ ఇక్కడ చదవచ్చు. తాను రాసిన పోస్ట్‌ని బట్టి  తాను గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చినందుకు, తనపై మోటారు వాహనాల  (MV) చట్టంలోని సెక్షన్ 66/192 కింద జరిమానా వేశారని అర్థం అవుతుంది. అసలు ఈ సెక్షన్లు ఏంటో చూద్దాం.

మోటారు వాహనాల (MV) చట్టంలోని సెక్షన్ 66 అంటే ఏమిటి?

MV చట్టంలోని సెక్షన్ 66 రవాణా వాహనాల నియంత్రణకు సంబంధించింది. చట్టంలో పేర్కొన్న విషయాలు సెక్షన్ 66 దేనికి ఉద్దేశించబడిందో స్పష్టంగా వివరిస్తాయి.

వాణిజ్య ప్రయోజనం (రవాణా) కోసం ఉద్దేశించిన మోటారు వాహనాలు ప్రాంతీయ రవాణా అథారిటీ (RTA) నుండి అవసరమైన అనుమతిని పొందాలి. వీటిని ‘ఎల్లో ప్లేట్’ వాహనాలు అంటారు. మరోలాగ చెప్పాలంటే, చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా మరియు పర్మిట్‌లో పేర్కొన్న ఏవైనా షరతులను ఉల్లంఘించి, రవాణా ప్రయోజనం కోసం వాహనాన్ని ఉపయోగించడం MV చట్టం ప్రకారం నేరం.

అదే సమయంలో, సెక్షన్ 66  కొన్ని మినహాయింపులను కూడా అందిస్తుంది.  ప్రభుత్వ వాహనాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు అత్యవసర సమయంలో ఇతర రాష్ట్రాలకు మళ్లించాల్సిన వాహనాల విషయంలో ఇవి వర్తిస్తాయి .

 మోటారు వాహనం (MV) చట్టంలోని సెక్షన్ 192 అంటే ఏమిటి?

MV చట్టంలోని సెక్షన్ 66 కింద చేసిన ఉల్లంఘనలకు జరిమానాలను సెక్షన్ 192 నిర్దేశిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఎవరైనా చెల్లుబాటు అయ్యే అనుమతి లేకుండా వాణిజ్య (రవాణా) ప్రయోజనం కోసం మోటారు వాహనాన్ని ఉపయోగిస్తుంటే లేదా పర్మిట్ షరతులను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే, జరిమానాల గురించి ఈ సెక్షన్ మాట్లాడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం, మొదటి నేరానికి గరిష్ట జరిమానా రూ. 5,000 మరియు కనీస జరిమానా రూ. 2000. అదనంగా, ఒక వ్యక్తికి 3 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఈ సెక్షన్ లో కొన్ని మినహాయింపులు నిర్వచించబడ్డాయి, అనారోగ్యం లేదా గాయంతో బాధపడుతున్న వ్యక్తుల రవాణా కోసం అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని ఉపయోగించడం వంటి వాటికి  ఎటువంటి జరిమానా ఉండదు.

నితిన్ నాయర్ యొక్క  కేసు సంగతేంటి?

2018లో నితిన్‌కి ఈ సంఘటన జరిగినప్పుడు, ఆయన దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యటంతో అది  వైరల్ అయింది. అనేక వార్త సంస్థలు ఈ సంఘటనఫై కథనాలు కూడా పబ్లిష్ చేసాయి. ఈ సంఘటనపై డెక్కన్ క్రానికల్ వాళ్ళు రాసిన కథనంలో  వారు ఈ కేసు గురించి హైదరాబాద్ ట్రాఫిక్ పొలిస్‌లో అడిషనల్ కమిషనర్ గా పని చేస్తున్న అనిల్ కుమార్‌ని సంప్రదించగా, ఆయన నితిన్ విషయంలో పోలీసులు తాను లిఫ్ట్ ఇచ్చిన వారి దగ్గర నుండి డబ్బులు తీసుకొన్నట్లుగా పొరబడి ఉంటారని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అంతే కాకుండా, లిఫ్ట్ ఇవ్వటం నేరం కాదు అని, మోటారు  వెహికల్స్ చట్టంలోని సెక్షన్ 66, ప్రైవేటు వాహనాన్ని టాక్సీలుగా  వాడకూడదు అని చెప్తుంది అని చెప్పారు. ఆ అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

అంతే కాక నితిన్ నాయర్ తాను ముంబై మిర్రర్‌కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులు తనని పర్మిట్ లేకుండా జనాలకి లిఫ్ట్ ఇచ్చి డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ వాహనంగా  పొరబడి ఉంటారేమో అని చెప్పారు. ముంబై లోని ఐరోలిలో  ఇలా కొంతమంది కార్ ఓనర్లు చేస్తారని చెప్పారు. కాకపోతే తన కారులో ఉన్న ప్యాసెంజర్లని పోలీసులు ఎందుకు డబ్బు కట్టారా లేదు అని ప్రశ్నించలేదు అనేది ఆయనకీ అర్ధం కాలేదు అని చెప్పారు. ఆ పూర్తి అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

ఎకనామిక్ టైమ్స్ వారు ఇదే సంఘటనపై రాసిన కథనంలో చట్టం లిఫ్ట్ ఇవ్వడం నేరంగా  చూడదని, నితిన్ నాయర్‌ని శిక్షించిన చట్టం ప్రైవేట్ వాహనాన్ని కమర్షియల్‌గా వాడటాన్ని నిషేధిస్తుంది అని రాసారు. పొరపాటుగా నితిన్ నాయర్‌ తన వాహనాన్ని కమర్షియల్‌గా వాడుతున్నారు అని పోలీసులు కేసు వేసి ఉంటారని  తమ అర్టికల్‌లో రాసారు .ఆ పూర్తి అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు. 

నిజానికి ఆచరణలో, నితిన్ నాయర్ పైన విధించిన సెక్షన్స్ సాధారణంగా వాణిజ్య రవాణా వాహనాల పర్మిట్ ఉల్లంఘనలకు మరియు  పర్మిట్ లేకుండా ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా నడుపుతున్న సందర్భాల్లో విధించబడతాయి. చాలా అరుదుగా  నితిన్ నాయర్ లాంటి సందర్భంలో చలాన్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి, ఇది ఒక  అరుదైన సంఘటనగా అర్థం చేసుకోవచ్చు. లిఫ్ట్ ఇవ్వటం నేరం కాదు, సొంత వాహనాన్ని పర్మిట్ లేకుండా కమర్షియల్ వాహనంగా వాడటం నేరం అని గుర్తుంచుకోవాలి.

చివరిగా, ఉచితంగా లిఫ్ట్ ఇవ్వటం నేరం కాదు, ప్రయివేట్ వాహనాన్ని  పర్మిట్ లేకుండా రవాణా వాహనంగా వాడటం నేరం.

Share.

About Author

Comments are closed.

scroll