నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ అతిపెద్ద పోటీదారు అని నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ వార్తలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ అతిపెద్ద పోటీదారు – ఆస్లే టోజే, నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్
ఫాక్ట్(నిజం): నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ పోటీదారు అంటూ నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే వ్యాఖ్యానించలేదు. ఇదే విషయం ఆస్లే టోజే కూడా స్పష్టం చేసాడు. నోబెల్ నియమాల ప్రకారం కూడా నామినేట్ అయిన వ్యక్తుల వివరాలు 50 సంవత్సరాల వరకు గోప్యంగా ఉంచుతారు. ఈ విషయానికి సంబంధించి మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రచారం చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
నోబెల్ శాంతి బహుమతి కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే ఇటీవల 14 మార్చి 2023న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (IIC)లో ఇండియా సెంటర్ ఫౌండేషన్ నిర్వహించిన “Alternative Development Model & Peace” అనే అంశంపై రౌండ్ టేబుల్ చర్చకు హాజరయ్యారు. ఈ సమావేశంలో టోజే రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో ప్రపంచ శాంతి గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా టోజే అనేక భారత మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో టోజే, భారత్ మరియు మోదీని పొగిడాడు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అణు ఆయుధాలు వాడకుండా మోదీ రష్యాకు చెప్పడం, భారత ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడం, మొదలైన అంశాలలో ఆస్లే టోజే మోదీని ప్రశంసించాడు.
ఐతే ఆస్లే టోజే మోదీని ప్రశంసిస్తూ మాట్లాడిన అంశాన్ని రిపోర్ట్ చేసే క్రమంలో చాలా జాతీయ మరియు స్థానిక మీడియా సంస్థలు ‘నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ అతిపెద్ద పోటీదారు’ అని ఆస్లే టోజే వ్యాఖ్యానించినట్టు రిపోర్ట్ చేసాయి.
తెలుగు మీడియా సంస్థలు ABN ఆంధ్రజ్యోతి, hmtv , NTV, abp దేశం మొదలైన వార్తా సంస్థలు, చాలా జాతీయ మీడియా సంస్థలు ఆస్లే టోజే ఇలా వ్యాఖ్యానించినట్టు రిపోర్ట్ చేసాయి.
అసలు ఆస్లే టోజే ఈ వ్యాఖ్యలు చేసాడా?
IICలో తాను చేసిన ప్రసంగంలో గానీ లేదా భారతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో, నోబెల్ శాంతి బహుమతికి మోడీని అగ్ర పోటీదారు అని ఆస్లే టోజే అనలేదు.
మోదీకి నోబెల్ శాంతి బహుమతి సంబంధించి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నోబెల్ శాంతి బహుమతిని అందుకోవాలని ఏ నాయకుడైనా కోరుకుంటారు. ఈ అవార్డుకు అర్హులు కావడానికి ప్రపంచంలో శాంతి కోసం తగినంతగా చేయడానికి ప్రయత్నించాలి. ఆవార్డుల కన్నా ప్రపంచం ముఖ్యం’ అని సమాధానమిస్తాడు.
నోబెల్ ప్రైజ్ నియమాలు ఎం చెప్తున్నాయి ?
నోబెల్ నియమాల ప్రకారం బహుమతి కోసం పరిశీలించిన వ్యక్తుల వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు. నోబెల్ బహుమతికి నామినేట్ అయిన వ్యక్తుల వివరాలు, అలాగే వారిని నామినేట్ చేసిన వారి వివరాలు, 50 సంవత్సరాల వరకు బయటికి తెలియనివ్వరు.
ఫలానా వ్యక్తి నోబెల్ బహుమతి రేసులో ఉన్నాడని వచ్చిన వార్తలు పూర్తిగా పుకార్లేనని, నోబెల్ వెబ్సైటులో స్పష్టంగా పేర్కొన్నారు. నోబెల్ బహుమతికి నామినేట్ అయినట్టు అసలు ఆ వ్యక్తులకు కూడా తెలియనంత గోప్యంగా ఉంచుతారని వెబ్సైటులో పేర్కొన్నారు.
దీన్నిబట్టి ఆస్లే టోజే మోదీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉండడని, అవి కేవలం కల్పిత వార్తలని స్పష్టమవుతుంది. నోబెల్ నియమాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
అస్లే టోజే ఈ వార్తలను ఖండించాడు:
మోదీ నోబెల్ బహుమతి రేసులో ఉన్నాడని తాను అన్నట్టు వస్తున్న వార్తలను ఆస్లే టోజే ఖండించాడు. మోదీని ఉద్దేశించి తను ఈ వ్యాఖ్యలను చేయలేదని మీడియాకు స్పష్టం చేసాడు.
ఈ విషయానికి సంబంధించి మరింత స్పష్టత కోసం మీము ఆస్లే టోజేను సంప్రదించాము. ఆయన వివరణ ఆధారంగా ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, నోబెల్ శాంతి బహుమతి రేసులో మోదీ ఉన్నాడని నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజే అనలేదు.