Fake News, Telugu
 

వీడియోలోని దృశ్యాలు చేపను బాటిల్లో ఉంచిన 30 రోజుల తర్వాత చిత్రీకరించినవి, 24 గంటల తర్వాత కాదు

0

ఒక చేపని కూల్ డ్రింక్ పోసిన సీసాలో ఉంచి 24 గంటల తర్వాత చూడగా చేప పూర్తిగా కరిగిపోయిందంటూ, రోజూ కూల్ డ్రింక్ తాగే వారి పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కూల్ డ్రింక్ పోసిన బాటిల్లో ఒక చేపని 24 గంటపాటు ఉంచిన తర్వాత అది పూర్తిగా కరిగిపోయినట్లు చూపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్: తరచూ కూల్ డ్రింకులు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, వీడియోలో చెప్పినట్లుగా ఒక్కసారి తాగిన వెంటనే మన శరీరం, ఎముకలు కరిగిపోవు. పైగా వీడియోలోని దృశ్యాలు చేపని 30 రోజులుగా బాటిల్లో ఉంచి బయటకు తీసిన తర్వాత చిత్రీకరించినవి, 24 గంటల తర్వాతవి కాదు. కూల్ డ్రింక్లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్‌కి పదార్ధాలను కరిగించే గుణం ఉంటుంది. కానీ ఈ యాసిడ్‌ని కూల్ డ్రింక్లలో చాలా తక్కువ మోతాదులో వాడుతారు. ఎప్పుడైనా ఒకసారి కూల్ డ్రింకు తాగితే పెద్దగా ప్రభావం ఉండదు కానీ, తరచూ తాగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆధారాలు ఉన్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా దీనికి సంబంధించిన పూర్తి వీడియోని పరిశీలించగా, ఈ వీడియో దాదాపు 4 ఏళ్ల క్రితం నుంచే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు గుర్తించాం. అయితే ఈ వీడియోలో చూపించిన దృశ్యాలు చేపని కూల్ డ్రింక్ బాటిల్లో ఉంచిన 30 రోజుల తర్వాత చిత్రీకరించినవి. 24 గంటల తర్వాతవి కావు.

అయితే కూల్ డ్రింకులలో ఉండే పదార్ధాలని పరిశీలించగా, కార్బనేటెడ్ వాటర్, పంచదార, ఫాస్ఫోరిక్ యాసిడ్, కెఫిన్ మొదలైన వాటితో తయారు చేస్తారని తెలిసింది.

ఇందులో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్‌కి పదార్ధాలను కరిగించే గుణం ఉంటుంది. కానీ ఈ యాసిడ్‌ని కూల్ డ్రింకులలో చాలా తక్కువ మోతాదులో వాడుతారు. అందువలన పరిమిత మోతాదులో కూల్ డ్రింక్ తాగిన వారిపై దీని ప్రభావం పెద్దగా ఉండదు. కానీ, తరచూ కూల్ డ్రింకులు తాగే వారికి వాటిలో ఉపయోగించే పదార్ధాల వలన పళ్ళు పుచ్చిపోవడం, మధుమేహం, బరువు పెరగడం, గుండె నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చివరిగా, తరచూ కూల్ డ్రింకులు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం వాస్తవమే అయినప్పటికీ, వీడియోలో చూపినట్లుగా కూల్ డ్రింక్ తాగిన 24 గంటలలో శరీరం, ఎముకలు కరిగిపోతాయనేది అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll