Fake News, Telugu
 

భారత దేశంతో పాటు అమెరికా, యూకే, చైనా మొదలగు దేశాలు కూడా ఇంకా తమ పౌరులని ఉక్రెయిన్ నుండి తరలించలేదు

0

ఉక్రెయిన్ దేశం ఖర్కివ్ నగరంపై రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో భారత దేశానికి చెందిన నవీన్ అనే మెడికల్ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కేవలం నాలుగు రోజుల ముందు మాత్రమే తమ పౌరులని స్వదేశానికి రమ్మని సూచించిందని, భారత దేశం మినహా మిగిలిన అన్ని దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి ముందే తమ పౌరులని స్వదేశానికి రప్పించుకున్నాయని ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత దేశం తప్ప మిగితా అన్ని దేశాలు రష్యా-యుద్ధానికి ముందే ఉక్రెయిన్ నుండి తమ పౌరులని స్వదేశానికి రప్పించాయి.

ఫాక్ట్ (నిజం): అమెరికా, యూకే లాంటి దేశాలు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముందుగానే గ్రహించి తమ పౌరులని ఉక్రెయిన్ విడిచి స్వదేశానికి రావాలని సూచించారు. కాని, ఈ దేశాలు ఉక్రెయిన్ దేశం నుండి తమ పౌరులను అందరినీ ఇంకా తరలించలేదు. చైనా, పాకిస్తాన్, యూకే దేశాలు ఇంకా తమ పౌరులని స్వదేశానికి రప్పించే పనిలో ఉన్నాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితులలో ఉక్రెయిన్ నుండి తమ పౌరులను తరలించలేమని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

అమెరికా:

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ద పరిణామాలలో అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్‌ నుండి తమ పౌరులను స్వదేశానికి రప్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకుందని ఇంటర్నెట్లో వెతికితే,  రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచనలో ఉందని ముందుగానే గ్రహించిన అమెరికా, జనవరి చివరి వారంలోనే ఉక్రెయిన్‌లో నివసిస్తున్న తమ పౌరులని వెంటనే స్వదేశానికి రావాలని సూచించినట్టు తెలిసింది.

రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి దాడులు చేయడం మొదలు పెట్టిన వెంటనే ఉక్రెయిన్‌ ప్రభుత్వం తమ గగనతలాన్ని ముసివేసింది. పౌరులను తరలించడానికి విమాన సదుపాయాలు లేకపోవడంతో, అమెరికా ప్రభుత్వం తమ పౌరులని రహదారుల మార్గాన ఉక్రెయిన్ పొరుగు దేశాలు పోలాండ్, రోమానియా, మొదలగు ప్రాంతాలకి వెళ్ళాలని తమ పౌరులకు సూచించింది. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా మారిన తరుణంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులు ఎక్కడికీ ప్రయానించవద్దని అమెరికా సూచించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పౌరులు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనీ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అమెరికాకు చెందిన కొన్ని ప్రైవేటు సంస్థలు అమెరికా పౌరులను ఉక్రెయిన్ నుండి తరలించడానికి సహాయం చేస్తుందని వార్తా సంస్థలు ఇటీవల రిపోర్ట్ చేసాయి.  

యూకే:

రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తుందని ఉహించిన బ్రిటన్ ప్రభుత్వం, ఉక్రెయిన్‌ దేశంలో నివసిస్తున్న తమ పౌరులు వెంటనే స్వదేశానికి రావాలని, యుద్ధ పరిస్థితి వస్తే బ్రిటన్ సైన్యం నుండి ఎటువంటి సహాయం ఉండదని 11 ఫిబ్రవరి 2022 నాడు ప్రకటించింది.

రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి దాడులు మొదలుపెట్టడంతో యూకే తమ దౌత్య కార్యాలయాన్ని ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరం నుండి పశ్చిమ దేశాల సరిహద్దు సమీపంలోని ల్వివ్ నగరానికి తరలించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను రోడ్డు మార్గం ద్వారా సరిహద్దు దేశాలకి రావాలని యూకే ప్రభుత్వం సూచించింది. యూకే ప్రభుత్వం తమ పౌరులను మాత్రమే కాకుండా ఉక్రెయిన్ శరణార్ధులను కూడా తాత్కాలిక వీసాలను అందచేసి  తమ దేశంలోకి రానిస్తుంది. కాని, ఈ తరలింపు చర్యలు ఇంకా పూర్తి అవలేదు.

చైనా:

రష్యా-ఉక్రెయిన్ యుద్ద పరిస్థితులలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 600 మంది చైనా దేశస్థులని మొదటి దశలో తరలించినట్టు చైనా వార్తా సంస్థలు 01 మర్చి 2022 నాడు రిపోర్ట్ చేసాయి. రెండవ దశలో 1000 మందికి పైగా ఉక్రెయిన్‌ నుండి తరలించే ఆలోచనలో చైనా ఎంబసీ ఉన్నట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. దీన్ని బట్టి, చైనా ప్రభుత్వం తమ దేశస్థులని ఉక్రెయిన్ నుండి తరలించే ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేదని స్పష్టమయ్యింది.

పాకిస్తాన్:

ఉక్రెయిన్‌ దేశంలో చిక్కుకున్న 3000కు పైగా ఉన్న తమ విద్యార్ధులని దాదాపుగా తరలించామని ఉక్రెయిన్‌లోని పాకిస్తాన్ అంబాసిడర్ నోయెల్ ఇస్రాయెల్ ఖోకర్ 26 ఫిబ్రవరి 2022 నాడు తెలిపారు. మిగిలి ఉన్న 500 నుండి 600 మంది పాకిస్తాన్ దేశస్థులను కూడా త్వరలో ఉక్రెయిన్ నుండి తరలిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.  పాకిస్తాన్ దేశస్థులు భారతీయ జెండాలు పట్టుకొని ఉక్రెయిన్ దాటుతున్నట్టు  ఇటీవల న్యూస్ రిపోర్ట్స్ కూడా పబ్లిష్ అయ్యాయి.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ద వాతావరణం నేలకొన్న పరిస్థుతులలో అక్కడ నివసిస్తున్న పౌరులను వెంటనే స్వదేశానికి రావాలని భారత ప్రభుత్వం 20 ఫిబ్రవరి 2022 నాడు సూచించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రంగా మారడంతో, ఉక్రెయిన్‌ దేశంలో చిక్కుకున్న 20,000 మందికి పైగా భారతీయులని భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, భారత దేశంతో సహా ఇతర దేశాలు కూడా ఇంకా తమ పౌరులను ఉక్రెయిన్ నుండి తరలించే పనిలో ఉన్నాయి. ఇతర దేశాలు తమ పౌరులను ఉక్రెయిన్ నుండి తరలించడానికి తీసుకొంటున్న చర్యలని ఇటీవల పలు భారతీయ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, భారత దేశంతో పాటు అమెరికా, యూకే, చైనా మొదలగు దేశాలు కూడా ఇంకా తమ పౌరులని ఉక్రెయిన్ నుండి తరలించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll