Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రాక్టర్లు పంపిణీ చేసే పథకమేది అమలు చెయ్యట్లేదు, కాకపోతే రైతులకు పరికరాలను కొనుక్కోవడానికి సబ్సిడీ అందిస్తుంది

0

పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకి ఉచిత ట్రాక్టర్ అందిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకి ఉచిత ట్రాక్టర్ అందిస్తుంది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా ట్రాక్టర్లను అందించే పథకమేది అమలు చేయట్లేదు. కాకపోతే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మేకనైజేషన్ (SMAM) అనే పథకం ద్వారా వ్యసాయానికి అవసరమయ్యే పరికరాలు/ యంత్రాలు కొనుక్కోవడానికి రైతులకు సబ్సిడీలు అందిస్తుంది. ఐతే ఇవి అందరికి అందుబాటులో ఉండవు, సంవత్సరానికి ఇన్ని యూనిట్లు పంపిణీ చేయాలని ముందుగానే నిర్ణయించి, దాని అనుగుణంగా సబ్సిడీలు కేటాయిస్తారు. పైగా ఈ పథకం కింద 100% సబ్సిడీ అందించరు, ఈశాన్య రాష్ట్రాలలో లబ్దిదారులకి యూనిట్ ధరపై 50% సబ్సిడీ అందించనుండగా, ఇతర రాష్ట్రాలలో లబ్దిదారులకి 40% సబ్సిడీ అందిస్తారు. కాకపోతే ఈ సబ్సిడీలకి సంబంధించి ఒక్కో పరికరానికి ఒక్కో గరిష్ట పరిమితి ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా ట్రాక్టర్లను అందించే పథకమేది అమలు చేయట్లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇలాంటిదేదైనా పథకం అమలు చేస్తూ ఉంటే, ఈ పథకం గురించిన సమాచారం ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ వెబ్సైటులోగాని లేదా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్సైటులోగాని ఉండేది, కాని మాకు ఈ వెబ్సైట్లలో రైతులకు ఉచితంగా ట్రాక్టర్లను అందించే పథకం గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు.

గతంలో కూడా ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పేరుతో ఎటువంటి పథకాన్ని అమలుచేయట్లేదని, ఈ వార్త ఫేక్ అని స్పష్టం చేసింది.

సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మేకనైజేషన్ (SMAM) :

చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణను అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2014-15లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మేకనైజేషన్ (SMAM) అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ SMAM పథకంలో సెంట్రల్ స్పాన్సర్ మరియు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని రెండు రకాలు ఉన్నాయి.

  • ఈ పథకం కింద కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హైటెక్ & హై వాల్యూ వ్యవసాయ పరికరాలు, ఫార్మ్ మెషినరీ బ్యాంకుల ఏర్పాటు ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయానికి అవసరమయ్యే యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ సెంటర్ల ద్వారా వ్యవసాయ యంత్రాలను కొనుక్కోలేని రైతులు కావలసిన యంత్రాలను అద్దెకు తెసుకోవచ్చు.
  • యంత్రాల వినియోగానికి రైతులకు కావాల్సిన అవగాహన, నైపుణ్యాల అభివృద్ధి కూడా ఈ SMAM పథకం కింద అందిస్తారు.
  • అలాగే ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీల కింద వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాలను అందించడం కూడా ఈ పథకం యొక్క ఉద్దేశాలలో ఒకటి. ఈ పథకం కింద ఈశాన్య రాష్ట్రాలలో లబ్దిదారులకి 50% సబ్సిడీ అందించనుండగా, ఇతర రాష్ట్రాలలో లబ్దిదారులకి 40% సబ్సిడీ అందిస్తారు. కాకపోతే ఈ సబ్సిడీలకి సంబంధించి ఒక్కో పరికరానికి ఒక్కో గరిష్ట పరిమితి ఉంటుంది. ఉదాహారణకి 2020-21 SMAM గైడ్లైన్స్ ప్రకారం, ఈ పథకం ద్వారా కొనుగోలు చేసే ట్రాక్టర్ 2WD (08-20 PTO HP)పై SC/ST, ఈశాన్య రాష్ట్రాల వారికైతే  50% సబ్సిడీ (గరిష్టంగా రెండు లక్షలు) సబ్సిడీ అందిస్తారు. అదే ఇతర క్యాటేగిరిల వారికీ 40% (గరిష్టంగా 1.6 లక్షలు) సబ్సిడీ అందిస్తారు.

ఈ పథకం ద్వారా అందరికీ సబ్సిడీ రూపంలో యంత్రాలు ఇవ్వరు, సంవత్సరానికి ఇన్ని యూనిట్లు పంపిణీ చేయాలని ముందుగానే నిర్ణయించి, దాని అనుగుణంగా సబ్సిడీలు కేటాయిస్తారు. వీటిలో SC/STలకు ప్రత్యేకంగా కొన్ని కేటాయిస్తారు. ఏయే పరికరానికి/ యంత్రానికి ఎంత సబ్సిడీ పొందొచ్చో ఇక్కడ చూడొచ్చు. సబ్సిడీలో పరికరాలు/ యంత్రాలు పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూడొచ్చు. 2021-22 బడ్జెట్‌లో సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మేకనైజేషన్ (SMAM) పథకానికి రూ. 1050 కోట్లు కేటాయించారు.

చివరగా, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రాక్టర్లు పంపిణీచేసే పథకమేది అమలు చెయ్యట్లేదు, కాకపోతే రైతులకు పరికరాలను/ యంత్రాలను కొనుక్కోవడానికి సబ్సిడీ అందిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll