పలు రిపోర్ట్స్ ప్రకారం, ఇటీవల 17 ఆగస్ట్ 2024న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 20 బోగీలు ట్రాక్ నుంచి బయటికొచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పట్టాలపై ఉన్నభారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు వెల్లడించారు(ఇక్కడ). 23 ఆగస్ట్ 2024న, అహ్మదాబాద్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న వందే భారత్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. రిపోర్ట్స్ ప్రకారం, రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవాయి-బిరోలియా సెక్షన్ మధ్య పట్టాలపై ఉంచిన సిమెంట్ స్లాబ్‌ను వందే భారత్ రైలుకు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో, ముగ్గురు బాలురు ఒక రైల్వే ట్రాక్ బోల్టులను ఒక పెద్ద స్పానర్ సహాయంతో తీసేస్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ వీడియో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇది భారత దేశంలో జరిగినట్టుగా పేర్కొంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశంలోని ఒక రైల్వే ట్రాక్‌ను కొంతమంది పిల్లలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో భారత దేశానికి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందినది. ఈ వీడియో కరాచీ నగరంలోని బోట్ బేసిన్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్న స్థానిక పిల్లలు రైల్వే ట్రాక్ పరికరాలను దొంగిలించిన దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను(ఆర్కైవ్డ్ లింక్) ‘Momentique News(మొమెంటిక్ న్యూస్)’ అనే ఫేస్‌బుక్ పేజీ 06 డిసెంబర్ 2023న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, వీడియోలోని దృశ్యాలు కరాచీలోని బోట్ బేసిన్ సమీపంలో రైల్వే ట్రాక్ పరికరాల చోరీకి సంబంధించిన సంఘటనను చూపిస్తున్నాయి. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో బోట్ బేసిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సర్తాజ్ ఖాన్ ఫాథక్ రైల్వే లైన్ వద్ద చోటు చేసుకుంది (ఉర్దూలో నుండి తెలుగులోకి అనువదించగా).
మొమెంటిక్ న్యూస్ పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ఒక న్యూస్&మీడియా వెబ్‌సైట్‌గా ఈ పేజీ యొక్క వివరణ( About)లో పేర్కొన్నారు. తదుపరి మేము ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ పేజీ నిర్వాహకుడిని సంప్రదించాము. పేజీ అడ్మిన్ ఎడ్విన్ మహర్(Edwin Maher) మాతో మాట్లాడుతూ, తాను కరాచీకి చెందిన ఒక జర్నలిస్టు అని తెలిపారు. అలాగే, ఈ వీడియో పాకిస్థాన్‌లోని కరాచీలోని బోట్ బేసిన్ ప్రాంతానికి చెందినది ధృవీకరించారు. ఈ వీడియో కరాచీలోని బోట్ బేసిన్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో నివసించే స్థానిక పిల్లలు రైల్వే ట్రాక్ పరికరాలను స్క్రాప్‌కు విక్రయించడానికి కోసం దొంగిలిస్తున్న దృశ్యాలను చూపిస్తుందని ఆయన పేర్కొన్నాడు.
డిసెంబరు 2023లో చాలా మంది పాకిస్తానీ సోషల్ మీడియా అకౌంట్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇదే వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఈ వీడియోల వివరణలు కూడా, ఈ వైరల్ వీడియో కరాచీలోని బోట్ బేసిన్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పరికరాల చోరీ దృశ్యాలను చూపిస్తున్నాయి పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే, వైరల్ వీడియోలో దృశ్యాలతో కూడిన ఒక వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) కరాచీ సౌత్ జోన్ పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మీడియా సెల్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసినట్లు గుర్తించాము. ఈ వీడియోలో ఈ ఘటన కరాచీలోని సర్తాజ్ ఖాన్ ఫాథక్ రైల్వే లైన్ వద్ద చోటు చేసుకుంది అని తెలియజేసారు. బోట్ బేసిన్ పోలీసులు రైల్వే ట్రాక్ పరికరాలను దొంగిలించిన పిల్లలను పట్టుకుని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు హెచ్చరించి పిల్లలను విడిచిపెట్టినట్లు ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో ఒక పోలీస్ అధికారి ముగ్గురు బాలులను ప్రశ్నించగా, వారిలో ఒకరు షెరీన్ జిన్నాహ్ కాలనీలో రైల్వే ట్రాక్ వద్ద నట్టులను మరియు బోల్టులను దొంగలించినట్టుగా ఒప్పుకున్నారు, తరువాత పోలీసు అధికారి అక్కడే ఉన్న ఓ బాలుడి తండ్రిని ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి చెప్తూ మందలించడం మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని బోట్ బేసిన్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పరికరాలను అక్కడి స్థానిక పిల్లలు చోరీ చేసిన దృశ్యాలను చూపిస్తున్నాయి అని మనం నిర్ధారించవచ్చు. ఇదే వీడియోని కరాచీ పోలీస్ (Media Cell – DIG South Zone) అధికారిక ఫేస్‌బుక్ పేజీలో కూడా షేర్ చేసారు .
సెప్టెంబరు 2022లో పాకిస్తాన్ మీడియా సంస్థ ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పబ్లిష్ చేసిన వార్త కథనం ప్రకారం, పాకిస్తాన్‌లోని సింధ్ మరియు బలూచిస్తాన్ ప్రావిన్సులలో అనేక రైల్వే పరికరాల దొంగతనాలు జరిగాయి. 2018 నుండి 2022 వరకు పాకిస్థాన్ రైల్వేస్‌కు చెందిన 88.581 మిలియన్ల (పాకిస్థానీ రూపాయలు) విలువైన అనేక రైల్వే ట్రాక్ పరికరాలు మరియు ఇతర రైల్వే ఆస్తులు దొంగిలించబడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
చివరగా, పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో జరిగిన రైల్వే ట్రాక్ పరికరాల చోరీకి సంబంధించిన వీడియోను భారతదేశానికి ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.