Fake News, Telugu
 

ఓటు వేయకపోతే జరిమానా విధించనున్నారని గతంలో ఒక పత్రిక ప్రచురించిన వ్యంగ్య కథనాన్ని నిజం అనుకొని షేర్ చేస్తున్నారు

0

మరికొన్ని రోజులలో దేశవ్యాప్తంగా లోక్ సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటింగ్‌కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ. 350 జరిమానా ఉంటుందని చెప్తున్న ఒక పేపర్ క్లిప్‌ను షేర్ చేస్తూ ఓటు వేయని వారి ఆధార్ కార్డు ద్వారా గుర్తించి, ఆ కార్డుతో అనుసంధానించబడిన వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ. 350 కట్ అవుతుందని ఈ వార్త సారాంశం. బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేని ఓటర్లు మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు వారి నగదు జరిమానా కింద కట్ అవుతుందని కూడా ఈ పోస్టులలో  చెప్తున్నారు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: రాబోయే 2024 ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ.350 జరిమానా ఉంటుంది.

ఫాక్ట్(నిజం): ఓటు వేయకపోతే జరిమానా విధించే నిబంధనేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ఈ వార్తను 2019లో ‘నవభారత్ టైమ్స్’ అనే పత్రిక వ్యంగంగా ప్రచురించింది. ఐతే ఈ వార్త వైరల్ కావడంతో  ఈ వార్త నిజం కాదని ఆ సంస్థ వివరణ కూడా ఇచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ప్రజలలో అవగాహన కల్పించి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఐతే వైరల్ పోస్టులో చెప్తున్నట్టు ఎన్నికల్లో ఓటు వేయని వారికి జరిమానా విధించే నిబంధనేది తీసుకరాలేదు.

ఈ వార్తకు సంబంధించిన సమాచారం కోసం వెతికే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇదే వార్తపై వివరణ ఇస్తూ చేసిన ఒక ట్వీట్ (ఆర్కైవ్) మాకు కనిపించింది. ఇది పూర్తిగా అవాస్తవమని, కమిషన్ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.

భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా ఈ వార్త అబద్ధమని పేర్కొంది. ఐతే ఈ వార్త గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఐతే అప్పట్లో కూడా ఎన్నికల సంఘం మరియు PIB ఈ వార్తలో నిజం లేదని కొట్టేసింది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

ప్రస్తుతం వైరల్ అవుతున్న పేపర్ క్లిప్‌కు కోసం మరింత వెతకగా 2019లో ‘నవభారత్ టైమ్స్’ అనే పత్రిక ఇదే సారాంశంతో ప్రచురించిన ఒక కథనం మాకు కనిపించింది. ఐతే ఈ హోలీ పండుగ సందర్భంగా ఈ వార్తను వ్యంగంగా ప్రచురరించిందే తప్ప, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు. వార్త చివర్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది (बुरा न मानो होली है). ఈ కథనం ఒక్క ఆన్లైన్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

ఈ కథనం నిజం అనుకొని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘నవభారత్ టైమ్స్’ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ కథనం హోలీ సందర్భంగా వ్యంగ్యంగా ప్రచురించిందని, ఇందులో నిజం లేదని తెలిపింది.

‘నవభారత్ టైమ్స్’ హోలీ సందర్భంగా ఇలాంటి వ్యంగ కథనాలు ప్రచరిస్తూ ఉంటుంది. గతంలో కూడా ఇలా ప్రచురించిన ఒక వ్యంగ కథనం వైరల్ అయినప్పుడు FACTLY దాన్ని డీబంక్‌ చేస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఓటు వేయకపోతే జరిమానా విధించనున్నారని గతంలో ఒక పత్రిక వ్యంగంగా ప్రచురించిన కథనాన్ని నిజం అనుకొని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll