ఏప్రిల్ 2024 నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు పంపించిన వారికి, అలాగే రిసీవ్ చేసుకున్న వారికి ఇద్దరికీ 18% GST విధించబడుతుందన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది (ఇక్కడ & ఇక్కడ). ఇదే వార్త ప్రచురించి ఉన్న ఒక న్యూస్ పేపర్ క్లిప్‌ను వివరిస్తున్న ఒక న్యూస్ వీడియోను ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఏప్రిల్ 2024 నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు పంపించిన వారికి, అలాగే రిసీవ్ చేసుకున్న వారికి ఇద్దరికీ 18% GST విధించబడుతుంది.
ఫాక్ట్(నిజం): గుడ్ మార్నింగ్ మెసేజ్‌లపై GST విధించే వార్తలో నిజం లేదు. ఈ వార్తను 2018లో నవభారత్ టైమ్స్ అనే సంస్థ హోలీ రోజున వ్యంగంగా ప్రచురించింది. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించిన పూర్తి ఫూటేజ్‌లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మొదటగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, GST, మొదలైన సంబంధిత వెబ్‌సైట్‌లలో ఇలా గుడ్ మార్నింగ్ మెసేజ్‌లపై GST విధించనున్నారనే విషయానికి సంబంధించిన సమాచారం కోసం వెతకగా, మాకు అలాంటి సమాచారమేదీ లభించలేదు.
ఆ తర్వాత ఈ వీడియోను చూపించిన న్యూస్ పేపర్ క్లిప్ కోసం వెతకగా ఈ వార్తను రిపోర్ట్ చేసిన కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వార్తను ‘నవభారత్ టైమ్స్’ అనే పత్రిక హోలీ పండుగ నాడు వ్యంగంగా ప్రచురించినట్టు తెలిసింది.
చివరగా, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో కోసం ABP news యూట్యూబ్ చానల్‌లో వెతకగా దీనికి సంబంధించిన పూర్తి వీడియో మాకు లభించింది. ఐతే ఈ వీడియోలో కూడా ఆ న్యూస్ పేపర్ క్లిప్‌ను ‘నవభారత్ టైమ్స్’ ఢిల్లీ ఎడిషన్‌లో 02 మార్చ్ 2018 నాడు ప్రచురించినట్టు తెలిపింది. హోలీ సందర్భంగా వ్యంగంగా ఈ వార్తను ప్రచురించినట్టు తెలిపింది. న్యూస్ పేపర్ క్లిప్ చివర్లో ఇదే విషయాన్ని (‘बूरा न मानो होली है’) కూడా తెలిపిందని ఈ పూర్తి వీడియోలో స్పష్టం చేసారు.
ఈ వివరాల బట్టి గతంలో హోలీ సందర్భంగా వ్యంగంగా ప్రచురించిన ఒక వార్తను నిజం అనుకొని ఇప్పుడు షేర్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.
చివరగా, గుడ్ మార్నింగ్ మెసేజ్‌లపై 18% GST విధించనున్నారని గతంలో వ్యంగంగా ప్రచురించిన ఒక వార్తను నిజం అనుకొని ఇప్పుడు షేర్ చేస్తున్నారు.