Fake News, Telugu
 

భారత దేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ ఇటీవల భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ను నిలదీయలేదు

0

భారతదేశంలో మైనారిటీలపై వేధింపుల గురించి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్  అంటోనీ బ్లింకెన్ ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ను బహిరంగంగా నిలదీసారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. అమెరికా ప్రక్షాళనపై తమకు అవగాహన ఉందని జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలకు అంటోనీ బ్లింకెన్ బదులిస్తూ, “ప్రపంచంలో 8వ అత్యంత హిందూ జనాభా కలిగిన అమెరికాలో హిందువులపై, హిందూ దేవాలయాలపై ఎప్పుడు ఎటువంటి దాడులు జరగలేదు. భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా మతమార్పిడి నిరోధక చట్టం ఉంది.  మీరు U.S.లో ఎక్కడైనా అటువంటి చట్టాన్ని చూపించగలరా?”, అని ప్రశ్నించినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, క్రైస్తవులను తమ విశ్వాసం కోసం హింసించబడుతున్న 50 దేశాలలో భారతదేశం 10వ స్థానంలో ఉందని, క్రైస్తవ విశ్వాసాన్ని అనుగదోక్కాలనుకునే మిమ్మల్ని (జయశంకర్), మీ తల్లిదండ్రులు క్రిస్టియన్ కాలేజిలో చదివించడానికి ఎందుకు ఆసక్తి చూపించారని ఒక ప్రెస్ మీట్లో అంటోనీ బ్లింకెన్ జయశంకర్‌ను నిలదీసినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల గురించి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ను బహిరంగంగా నిలదీసారు.

ఫాక్ట్: భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక చర్చలలో భాగంగా 11 ఏప్రిల్ 2022 నాడు ఇరు దేశాల విదేశాంగ మరియు రక్షణ శాఖ మంత్రుల మధ్య (2+2) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ భారత దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను, అలాగే కొన్ని ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న తీరుని క్రమంగా మానిటర్ చేస్తున్నామని తెలిపారు.  కానీ, భారతదేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని అంటోనీ బ్లింకెన్ ఇటీవల భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ను ప్రశ్నించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది .

పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌కి సంబంధించిన వివరాల కోసం కొన్ని పదాలను ఉపయోగించి వెతికితే, భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక చర్చలలో భాగంగా 11 ఏప్రిల్ 2022 నాడు ఇరు దేశాల విదేశాంగ మరియు రక్షణ శాఖ మంత్రుల మధ్య సమావేశం జరిగినట్టు తెలిసింది. ఈ సమావేశంలో భాగంగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ భారతదేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. “భారత దేశంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలని, కొన్ని ప్రభుత్వాలు, పోలీసులు, జైలు అధికారులు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న తీరుని క్రమంగా పర్యవేక్షిస్తున్నాము”, అని తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలని రిపోర్ట్ చేస్తూ అమెరికా ప్రభుత్వం తమ వెబ్సైటులో ఒక జాయింట్ స్టేట్మెంట్ పబ్లిష్ చేసింది. అంటోనీ బ్లింకెన్ ఈ సమావేశంలో భారతదేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించినట్టు ఈ జాయింట్ స్టేట్మెంట్లో ఎక్కడ పేర్కొనలేదు.

12 ఏప్రిల్ 2022 నాడు జయశంకర్‌తో జరిగిన మరొక చర్చలో కూడా అంటోనీ బ్లింకెన్ భారతదేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని ఎక్కడా పేర్కొనలేదు. అంటోనీ బ్లింకెన్ భారతదేశంలో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారని చేసిన వ్యాఖ్యలకు జయశంకర్‌ స్పందిస్తూ, “అమెరికాతో జరిగిన సమావేశాలలో మానవ హక్కుల గురించి ఎక్కడా చర్చించలేదు. భారతదేశంపై ఎవరికైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్చ ఉంది. అలాగే, అమెరికాతో సహా వేరే దేశలలో ఉన్న మానవ హక్కుల పరిస్థుతుల గురించి భారతదేశానికి తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచే స్వేచ్చ ఉంది. ఒకవేళ మానవ హక్కుల గురించి చర్చ జరిగితే, మేము మా అభిప్రాయాన్ని చెప్పడానికి వేనుకాడబోము”, అని సమాధానమిచ్చారు. జయశంకర్‌ చేసిన ఈ వ్యాఖ్యలకు అంటోనీ బ్లింకెన్ స్పందించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

28 అక్టోబర్ 2021 నాడు అంతర్జాతీయ మత స్వేచ్చ దినోత్సవం సందర్భంగా అంటోనీ బ్లింకెన్, “ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ మతం లేదా విశ్వాసం ఎంచుకొనే స్వేచ్ఛను ప్రోత్సహించడానికి అలాగే, రక్షించడానికి అమెరికా తమ ప్రయత్నాన్ని ఎప్పటికీ వదులుకోదు”, అని ట్వీట్ చేసారు. కానీ, భారత దేశంలో ముఖ్యంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని అంటోనీ బ్లింకెన్ ఇటీవల బహిరంగంగా ఎక్కడా పేర్కొనలేదు.

చివరగా, భారతదేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ ఇటీవల భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ను నిలదీయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll