ఇంట్లో ఒక్క ఆవు మాత్రమే ఉండాలని, ప్రతీ సంవత్సరం 1000 రూపాయలు పన్ను కట్టాలనే గో సంపద అభివృద్ధి నిరోధక చర్యలు రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల ఆవులకు సంబంధించి రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తి రాష్ట్రానికి వర్తిస్తుంది.
ఫాక్ట్: రాజస్థాన్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలో ఉండే ఆవులు లేదా గేదెలకు సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకుంది; పూర్తి రాష్ట్రానికి సంబంధించి కాదు. ఈ నిబంధనల ప్రకారం, ఆవులు లేదా గేదెలను ఉంచుకోవడానికి వార్షిక లైసెన్స్ తీసుకోవాలి, ఒక్క ఆవు, ఒక్క దూడ కంటే సంఖ్య ఎక్కువగా ఉంటే లైసెన్స్‌ను రద్దు చేస్తారు. వార్షిక లైసెన్స్ ఫీజుగా ₹1,000 వసూలు చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా పశువుల మేత విక్రయాలు అనుమతించబడవు. అనధికార విక్రయాలపై ₹500 జరిమానా విధించబడుతుంది. ఈ నిబంధనలు మునిసిపల్ కార్పొరేషన్లు మరియు కౌన్సిల్‌ల పరిధిలోని అన్ని ప్రాంతాలలో అమలు చేయబడతాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇటీవల ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం, రాజస్థాన్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలో ఉండే ఆవులు లేదా గేదెలకు సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకుంది; పూర్తి రాష్ట్రానికి సంబంధించి కాదు. రాజస్థాన్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలో ఆవులు లేదా గేదెలను ఉంచుకోవడానికి వార్షిక లైసెన్స్ మరియు 100 చదరపు గజాల విస్తీర్ణం తప్పనిసరి చేసింది. ఒక్క ఆవు, ఒక్క దూడ కంటే సంఖ్య ఎక్కువగా ఉంటే లైసెన్స్‌ను రద్దు చేస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందడానికి, దరఖాస్తుదారు పశువుల కోసం ప్రతిపాదిత స్థలం వివరాలను సమర్పించాలి. వార్షిక లైసెన్స్ ఫీజుగా ₹1,000 వసూలు చేయబడుతుంది. కొత్త నిబంధనలు మునిసిపల్ కార్పొరేషన్లు మరియు కౌన్సిల్‌ల పరిధిలోని అన్ని ప్రాంతాలలో అమలు చేయబడతాయి.
రాజస్థాన్ ప్రభుత్వం యొక్క నిభందనలు ఇలా ఉన్నాయి:
బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా పశువుల మేత విక్రయాలు అనుమతించబడవు. అనధికార విక్రయాలపై ₹500 జరిమానా విధించబడుతుంది. పశువులను ఉంచడానికి, 170-200 చదరపు అడుగుల విస్తీర్ణం మరియు 200-250 చదరపు అడుగుల బహిరంగ ప్రదేశం అవసరం. పశువుల యజమాని పాలు లేదా దాని ఉత్పత్తులను విక్రయించడం వంటి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించలేరు.
పారిశుద్ధ్యం విషయంలో రాజీపడితే ₹5,000 జరిమానా విధించబడుతుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి ఆవు పేడను పురపాలక ప్రాంతం వెలుపల పారవేయడం పశువుల యజమాని యొక్క బాధ్యత. ఆవు పేడను బహిరంగ ప్రదేశాల్లో ఎండబెట్టకూడదు.
ఈ నిబంధనల ప్రకారం, 213 పట్టణాల్లో సుమారు 95% జనాభా ఆవులను పెంచుకోవడం కష్టమవుతుందని న్యూస్ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.
చివరగా, ఇటీవల రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవులకు సంబంధించి విడుదల చేసిన కొత్త నిబంధనలు పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికే వర్తిస్తాయి.