ప్రయాగరాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళాకి స్విట్జర్లాండ్ నుంచి ఒక విదేశీ యాత్రికుడు కాలినడకన వచ్చాడని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 2025 ప్రయాగరాజ్ మహా కుంభమేళాకి స్విట్జర్లాండ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన ఒక విదేశీ యాత్రికుడి వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో 2021 హరిద్వార్ కుంభమేళా నాటిది. స్విట్జర్లాండ్ యాత్రికుడు బెన్ వియాట్ 2016 నుంచి చెక్ రిపబ్లిక్ దేశం నుంచి కాలినడకన భారత్‌కు వచ్చి మార్చి 2021లో జరిగిన హరిద్వార్ కుంభమేళాలో పాల్గొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.
ముందుగా వైరల్ వీడియోనీ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో (ఆర్కైవ్) గౌతమ్ ఖట్టర్ అనే యూట్యూబ్ ఛానెల్లో 22 మార్చ్ 2021లో అప్లోడ్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో ప్రకారం, మార్చ్ 2021లో జరిగిన హరిద్వార్ కుంభమేళాకి బెన్ వియాట్ (బెన్ బాబా) అనే స్విట్జర్లాండ్ వ్యక్తి చెక్ రిపబ్లిక్ దేశం నుంచి కాలినడకన వచ్చి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

బెన్ వియాట్ సోషల్ మీడియా ఖాతాల్లో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఈ యాత్రకి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. 2016లో చెక్ రిపబ్లిక్ నుంచి కాలినడకన గ్రీస్, టర్కీ, చైనా, పాకిస్థాన్ వంటి వివిధ దేశాలలో పర్యటిస్తూ చివరిగా 2020లో భారత్ చేరుకున్నానని బెన్ పేర్కొన్నారు. అలాగే 2025 ప్రయాగరాజ్ కుంభమేళా పాల్గొన్నట్లు ఈ ఆర్టికల్ ప్రచురించే సమయానికి బెన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించలేదు.

పై ఆధారాలను బట్టి, వైరల్ వీడియో 2021 హరిద్వేర్ కుంభమేళాకు చెందినదని నిర్ధారించవచ్చు.
చివరిగా, 2021 హరిద్వార్ కుంభమేళాలో విదేశీ యాత్రికుడు పాల్గొన్న వీడియోని 2025 ప్రయాగరాజ్ మహా కుంభమేళాకి ముడిపెడుతున్నారు.