“పాకిస్థాన్ జిందాబాద్ అంటున్న వారికి …సన్మానం చేస్తున్న పోలీసులు”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకొని కొడుతున్నట్టు చూడవచ్చు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని అన్నవారిని పోలీసులు కొడుతున్న వీడియో.
ఫాక్ట్: వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. వీడియోలో పోలీసులు కొడుతుంది ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్నందుకు కాదు; మొబైల్ దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఆ పిల్లలను పోలీసులు కొట్టారు. చందౌలీ పోలీసుల ప్రకారం పోస్ట్‌లోని వీడియో కనీసం ఒక సంవత్సరం కంటే పాతది. అంతేకాదు, ఆ ఘటన తర్వాత ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కావున, పోస్ట్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్నందుకు పోలీసులు కొడుతున్నారని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అలాంటి దృశ్యాలతో ఉన్న వీడియోలు కనీసం మే 2021 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. అయితే, ఆ పాత పోస్టుల్లో ఎక్కడా కూడా పోలీసులు కొడుతుంది ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్నందుకు అని లేదు. వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలీ జిల్లాకు సంబంధించింది అని, మొబైల్ దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఆ పిల్లలను పోలీసులు కొట్టినట్టు తెలిసింది.
ఆ ఘటనకి సంబంధించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. మొబైల్ దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఆ పిల్లలను పోలీసులు కొట్టారని రిపోర్ట్ అయినట్టు చదవచ్చు. ఆ ఘటన యొక్క వీడియో వైరల్ అవడంతో కైలావర్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ శివానంద్ వర్మ, బలువా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దిలీప్ కుమార్‌లను ఎస్పీ అమిత్ కుమార్ సస్పెండ్ చేశారని తెలిసింది.

పాత వీడియో ఇప్పుడు ‘పాకిస్థాన్ జిందాబాద్’ క్లెయిమ్‌తో వైరల్ అవుతుండడంతో చందౌలీ పోలీసులు ఈ విషయంపై 20 మార్చి 2022న ట్వీట్ చేసారు. వీడియో కనీసం ఒక సంవత్సరం కంటే పాతది అని, ఆ ఘటన తర్వాత ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అంతేకాదు, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని షేర్ చేయవద్దని కోరారు.
చివరగా, వీడియోలోని వ్యక్తిని పోలీసులు కొడుతుంది ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్నందుకు కాదు; మొబైల్ దొంగతనం ఆరోపణ నేపథ్యంలో ఆ పిల్లలను పోలీసులు కొట్టారు.