Fake News, Telugu
 

సంబంధం లేని వీడియోని మాదిగల విశ్వరూప మహాసభకు హాజరయ్యేందుకు వందలాది మంది ప్రజలు రైల్వే స్టేషన్లకు తరలివచ్చిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

విశ్వరూప మహాసభకు బయలుదేరుతున్న మాదిగ దండు”, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై వందలాది జనం రైలు కోసం వేచి చూస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (MRPS) 11 నవంబర్ 2023 నాడు హైదరాబాద్‌లో మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహించిన నేపథ్యంలో, ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మాదిగల విశ్వరూప మహాసభకు హాజరయ్యేందుకు వందలాది మంది ప్రజలు రైల్వే స్టేషన్‌కు తరలివచ్చిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరంలోని కల్యాణి సబ్-అర్బన్ రైల్వే స్టేషన్లో దుర్గా పూజ మరియు దసరా పండగ సందర్భంగా వందలాది ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో 25 అక్టోబర్ 2023 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ వీడియోతో మాదిగల విశ్వరూప మహాసభకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఈ వీడీయోని ఒక ఇంస్టాగ్రామ్ యూసర్ 25 అక్టోబర్ 2023 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరంలోని కల్యాణి సబ్-అర్బన్ రైల్వే స్టేషన్లో దుర్గా పూజ మరియు దసరా పండగ సందర్భంగా వందలాది ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తున్న దృశ్యాలంటూ ఈ ఇంస్టాగ్రామ్ యూసర్ తెలిపారు.

దుర్గా పూజ సందర్భంగా కల్యాణి రైల్వే స్టేషన్లో పోటెత్తిన జనాలను చూపిస్తూ షేర్ చేసిన మరికొన్ని వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కల్యాణి రైల్వే స్టేషన్ గూగుల్ మ్యాప్స్ ఫోటోలను పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలతో పొల్చి చూడగా, ఈ వీడియో కోల్‌కతా నగరంలోని కల్యాణి రైల్వే స్టేషన్లో తీసినట్టు స్పష్టమయ్యింది.

చివరగా, సంబంధం లేని వీడియోని మాదిగల విశ్వరూప మహాసభకు హాజరయ్యేందుకు వందలాది మంది ప్రజలు రైల్వే స్టేషన్‌కు తరలివచ్చిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll