Fake News, Telugu
 

సంబంధం లేని వీడియోని టర్కీ మరియు సిరియాలో సంభవించిన భారీ భూకంపం దాటికి అక్కడి భవనాలు కూలిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి అక్కడి భవనాలు కూలిపోతున్న దృశ్యాలంటూ సోషల్ మిడీయాలో ఒక వీడియో షేర్ అవుతోంది. 06 ఫిబ్రవరి 2023 నాడు టర్కీ మరియు సిరియాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలలో అక్కడి ప్రజలు మృతి చెందిన నేపథ్యంలో, ఈ వీడియో షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దాటికి అక్కడి భవనాలు కూలిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఒక భవన కూల్చివేత దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో గత నెల జనవరి నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. టర్కిలో 06 ఫిబ్రవరి 2023 నాడు తెల్లవారుజామున మొట్టమొదట భూకంపం సంభవించింది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇటీవల టర్కీ మరియు సిరియాలో చోటుచేసుకున్న భూకంపానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక టిక్‌టాక్ యూసర్ 16 జనవరి 2023 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. సౌదీ అరేబియాలో జెద్దా నగరంలోని పాత మక్కా రోడ్డు మార్గంలో భవన కూల్చివేత దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ ఆ టిక్‌టాక్ యూసర్ తెలిపారు.

ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, వీడియోలో కనిపిస్తున్న అదే భవనం ఒక యూట్యూబ్ ఛానెల్ 2022 ఏప్రిల్ నెలలో పబ్లిష్ చేసిన వీడియోలో కనిపించింది. జెద్దా నగరంలోని పాత మక్కా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా తీసిన వీడియో ఇది. ఈ భవనం యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్‌ని ఇక్కడ చూడవచ్చు.

‘సౌదీ విజన్ 2030’ ప్రొజెక్టులో భాగంగా జెద్దా నగరంలోని పలు ప్రాంతాలలోని భవనాలను ప్రభుత్వం కూల్చివేస్తున్నట్టు పలు వార్తా సంస్థలు ఇటీవల రిపోర్ట్ చేశాయి. టర్కీలో ఇటీవల సంభవించిన భూకంపం దాటికి అక్కడి చాలా భవనాలు కూలిపోయాయి. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇటీవల టర్కీ మరియు సిరియాలో చోటుచేసుకున్న భూకంపానికి సంబంధించినది కాదు.

చివరగా, సంబంధం లేని వీడియోని షేర్ చేస్తూ టర్కీ మరియు సిరియాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి అక్కడి భవనాలు కూలిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll