Fake News, Telugu
 

పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన పాత వీడియోని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడిని ప్రజలు తరిమికొడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడిని ప్రజలు ఉరికిచ్చి కొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ మంత్రి శ్రీకాంత్ శర్మ అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడిని ప్రజలు తరిమికొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినది. పశ్చిమ బెంగాల్ భీర్బుం జిల్లాలోని ధర్మాపూర్ గ్రామంలో బీజేపీ నాయకుడు అనిర్బన్ గంగూలీ కాన్వాయ్‌పై నిరసనకారులు దాడి చేసిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ నాయకుడు అలాగే, ఉత్తరప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మపై ప్రజలు దాడి చేసినట్టు ఇంటర్నెట్లో ఇటీవల ఎక్కడా రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని ‘Nandighosha TV’ న్యూస్ ఛానల్ 29 ఏప్రిల్ 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్ రాష్రంలోని ధర్మాపూర్ గ్రామంలో బీజేపీ నాయకుడిని ప్రజలు గ్రామం నుండి తరిమివేస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని ‘News 18 Bangla’ వార్తా సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఇళ్లంబజార్ పట్టణం సమీపంలో బోల్పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి అనిర్బన్ గంగూలీ కాన్వాయ్‌పై గ్రామస్థులు దాడి చేసిన దృశ్యాలంటూ ఈ వీడియోలో తెలిపారు.

2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకుడు అనిర్బన్ గంగూలీ ఇళ్లంబజార్ పట్టణం సమీపంలోని గ్రామాలలో ప్రచారం చేస్తుండగా, ధర్మాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అనిర్బన్ గంగూలీ కాన్వాయ్‌పై దాడి చేసి అతన్ని గ్రామం నుంచి తరిమికొట్టినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఆ న్యూస్ రిపోర్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. తనపై జరిగిన ఈ దాడి గురించి అనిర్బన్ గంగూలీ 29 ఏప్రిల్ 2021 నాడు ట్వీట్ కూడా పెట్టారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినదని, ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినది కాదని స్పష్టమయ్యింది. 

బీజేపీ నాయకుడు అలాగే, ఉత్తరప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మపై ప్రజలు దాడి చేసినట్టు ఇంటర్నెట్లో ఇటీవల ఎక్కడా రిపోర్ట్ అవలేదు. ఇటీవల, ఝార్ఖండ్ బీజేపీ నాయకుడిపై జరిగిన ఒక పాత దాడి వీడియోని బీజేపి నాయకుడు శ్రీకాంత్ శర్మపై ప్రజలు దాడి చేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లి దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడిని ప్రజలు తరిమికోడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll