జపాన్ దేశంలో జరగవలిసిన ఒలింపిక్స్ క్రీడలు కరోన కారణంగా వాయిదా పడినందున, ప్రారంభోత్సవ కార్యక్రమం కొరకు సిద్ధం చేసిన బాణసంచాలను, జపాన్ దేశం వారు ఫూజి పర్వతం దగ్గర కాల్చేసారంటు షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఒలింపిక్స్ క్రీడల కోసం సిద్దం చేసిన బాణసంచాలను జపాన్ దేశం ఫూజి పర్వతం సమీపంలో కాల్చివేసింది.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్నది కంప్యూటర్లో సిములేట్ చేసిన బాణసంచాలు, నిజమైనవి కాదు. ‘hiramu55bocaboca’ అనే యూసర్ ‘FWsim’ వెబ్సైటులో ఈ బాణసంచాల వీడియో తయారు చేసి తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసారు. జపాన్ లో జరుగబోయే ఒలింపిక్స్ క్రీడలకి, ఈ వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘hiramu55bocaboca’ అనే యూట్యూబ్ ఛానెల్ ‘FWsim Mount Fuji synchronized fireworks show2’ అనే టైటిల్ తో పోస్ట్ చేసింది. ‘01 December 2015’ నాడు ఈ వీడియో ని యూట్యూబ్ లో ఈ ఛానల్ వారు పోస్ట్ చేసారు. ‘FWsim’ వెబ్సైటు తమకు నచ్చిన బాణసంచా వీడియోని తయారు చేసుకునే సదుపాయం అందరికీ కలిపిస్తుంది. పోస్టులో షేర్ అదే వీడియో ‘gfycat’ వెబ్సైటులో కూడా దొరికింది. ఈ వీడియోని ఫేస్బుక్ లో షేర్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియా యూజర్స్ ‘hiramu55bocaboca’ ఛానల్ కి క్రెడిట్ ఇస్తూ పోస్ట్ పెట్టారు. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
జపాన్ దేశంలో ‘24 July 2020’ నాడు ‘టోక్యో 2020’ ఒలింపిక్స్ క్రీడలు మొదలు కావల్సి వుండగా, కరోన కారణంగా ఈ ఈవెంట్ 2021కి వాయిదా పడింది. వాయిదా పడిన ఒలింపిక్స్ క్రీడలు మొదలవటానికి సరిగ్గా సంవత్సరం ఉన్నందుకు గుర్తుగా జపాన్ దేశంలో బాణసంచలు పేల్చారు. వాటికి సంబంధించిన ఆర్టికల్ మరియు వీడియోని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ‘FWsim’ వెబ్సైటులో సృష్టించిన బాణసంచా వీడియోని చూపిస్తూ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సిద్ధం చేసిన బాణసంచాలని కాల్చేస్తున్న జపాన్ దేశమంటూ షేర్ చేస్తున్నారు.