11 మార్చి 2025న, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటుదారులు పాకిస్తాన్‌లో ఒక రైలును (జాఫర్ ఎక్స్‌ప్రెస్) ఆపి హైజాక్ చేశారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). రైలు క్వెట్టా నుండి పెషావర్‌కు వెళుతుండగా వారు రైల్వే ట్రాక్‌ను పేల్చివేశారనీ, అలాగే కనీసం ఆరుగురు సైనిక సిబ్బందిని (ఇక్కడ) చంపారని వార్తా కథనాలు ఉన్నాయి. రైలును హైజాక్ చేసిన ఉగ్రవాదులలో కనీసం 27 మందిని భద్రతా దళాలు హతమార్చాయని, అలాగే 155 మంది ప్రయాణికులను రక్షించారని వార్త కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, హైజాక్ చేయబడిన రైలు దృశ్యాలు అని క్లెయిమ్ చేస్తున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 11 మార్చి 2025న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఏప్రిల్ 2022 నుండి ఆన్‌లైన్‌లో ఉన్న పాత వీడియో. దీనికి మార్చి 2025 హైజాక్‌కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియోని వెరిఫై చేస్తున్న సమయంలో, ఈ వీడియోతో ఉన్న పోస్ట్‌ల క్రింద కొందరు ఇది పాత వీడియో అని కామెంట్ చేయడం గమనించాము. మిషన్ తక్మీల్ అనే X యూసర్, 2025 జాఫర్ ఎక్స్ప్రెస్ గురించి పోస్ట్ చేస్తూ, ఈ వీడియోని షేర్ చేశారు. కానీ, ఇది పాత సంఘటన అని, దీన్ని ప్రతితాత్మక వీడియో లాగా షేర్ చేశాడు అని పోస్ట్ కింద కామెంట్ చేశారు.
అలాగే, మరో X యూసర్ ఈ వీడియో యొక్క లాంగ్ వెర్షన్‌ను వైరల్ వీడియో ఉన్న ఒక పోస్ట్ కింద పోస్ట్ చేసి ఇది పాత వీడియో అని చెప్పారు.
దీనిని క్లూగా తీసుకొని, మేము ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, వైరల్ వీడియోను కలిగి ఉన్న ఒక 2022 నాటి X పోస్ట్ (ఆర్కైవ్ లింక్) మాకు దొరికింది. దీన్ని 15 ఏప్రిల్ 2022న Rohan Panchigar అనే యూజర్ ట్వీట్ చేశారు. ‘BLA has released footage of an IED attack on Train carrying FC(Frontier Corps) near Sibbi, Balochistan.,’ అనే వివరణతో దీన్ని పోస్ట్ చేశారు.
దీని గురించి మరింత తెలుసుకోవడానికి మేము ఇంటర్నెట్లో మరొక కీవర్డ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా పాకిస్తాన్‌లోని సిబి జిల్లాలో 15 మార్చి 2022న జరిగిన IED పేలుడు సంఘటన గురించి మార్చి 2022 నాటి కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ పేలుడుకు BLA బాధ్యత వహించిందని ఇందులో పేర్కొన్నారు. అయితే, ఈ వార్తా నివేదికలలో ఏప్రిల్ 2022లో అప్లోడ్ చేసిన వీడియోలో కనిపించే దృశ్యాలు లేవు.

అదనంగా, వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలను 12 సెప్టెంబర్ 2022న Xలో ‘న్యూస్9 ప్లస్’ పోస్ట్ చేసిన ఒక వీడియో స్టోరీ ఉండటం మేము గమనించాము. ఈ వీడియోలో 0:05 సెకన్ల మార్క్ దగ్గర వైరల్ వీడియోలోని దృశ్యాలని మనం చూడవచ్చు. ఈ ఆధారాలను బట్టి, వైరల్ వీడియోకు 2025 మార్చిలో పాకిస్తాన్‌లో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌కు సంబందించింది కాదు అని మనకి స్పష్టం అవుతుంది.
చివరగా, మార్చి 2025 పాకిస్తాన్ రైలు హైజాక్ సంఘటనకు సంబంధించిన వీడియో అని 2022 నాటి ఒక పాత వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.