‘భారతదేశ చరిత్రలో మొదటిసారి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకురాని ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని’ క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశ చరిత్రలో మొదటిసారి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకురాని ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.
ఫాక్ట్ (నిజం): మోదీ హయాంలో 2014- 2021 మధ్య కాలంలో IBRD మరియు IDA నుండి వివిధ ప్రాజెక్టుల కోసం సుమారు USD 30,040.34 మిలియన్ల రుణాన్ని తీసుకుంది. ఇందులో అత్యధికంగా గత సంవత్సరం 2020లో సుమారు USD 5,000 మిలియన్ల రుణాన్ని తీసుకుంది. కరోనాని ఎదురుకోవడం కోసం కూడా 1 బిలియన్ డాలర్ల రుణాన్ని భారత ప్రభుత్వం గత సంవత్సరం తీసుకుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రపంచ బ్యాంకు తన అనుబంధ సంస్థలైన IBRD (ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్), IDA (ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్) మరియు IFC (ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కోఆపరేషన్) ద్వారా ప్రపంచ దేశాల్లోని డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు సున్నా లేదా తక్కువ వడ్డీ రేట్లకు అప్పులు ఇస్తుంది.
IBRD ద్వారా తక్కువ, తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలకు అప్పులను అందిస్తుండగా, IDA తక్కువ ఆదాయ దేశాలకు అప్పులను అందిస్తుంది. ఇక IFC, ప్రైవేటు సెక్టార్‌కి రుణాలను అందిస్తుంది. ప్రపంచ బ్యాంకు వెబ్సైటులో ఈ రుణాలకు సంబంధించి సమగ్ర సమాచరం అందుబాటులో ఉంటుంది.
ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం భారత దేశం 2014- 2021 మధ్య కాలంలో IBRD మరియు IDA నుండి వివిధ ప్రాజెక్ట్‌ల కోసం సుమారు USD 30,040.34 మిలియన్ల రుణాన్ని తీసుకుంది. ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2004-2013 మధ్య కాలంలో సుమారు USD 33,500 మిలియన్ రుణాన్ని తీసుకుంది.
ఏ సంవత్సరం ఏ గ్రూప్ నుండి ఎంత రుణం తీసుకుందో కింద చూడొచ్చు. మోదీ హయాంలో అత్యధికంగా గత సంవత్సరం 2020లో సుమారు USD 5,000 మిలియన్ల రుణాన్ని తీసుకుంది. కరోనాని ఎదురుకునేందుకు గత సంవత్సరం భారత ప్రభుత్వం India COVID-19 Emergency Response and Health Systems Preparedness Project పేరుతో వరల్డ్ బ్యాంకు నుండి బిలియన్ డాలర్ల రుణాన్ని పొందింది.
భారత ప్రభుత్వం మరియు భారత్ లోని ప్రైవేట్ రంగ సంస్థలు ప్రపంచ బ్యాంకు నుండి ఏ రోజు ఎంత రుణాన్ని తీసుకున్నాయో ఇక్కడ చూడొచ్చు. ఈ వివరాలను బట్టి, ఇప్పటి వరకు ప్రధాని మోదీ హయాంలో ప్రపంచ బ్యాంకు నుండి రుణాన్ని తీసుకోలేదన్న వాదన పూర్తిగా అవాస్తవమని అర్ధమవుతుంది.
చివరగా, ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకోని ఏకైక ప్రధాని మోదీ అన్న వాదన అవాస్తవం; మోదీ హయాంలో ప్రపంచ బ్యాంకు నుండి భారత్ సుమారు 30,000 మిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది.